ముంబై: ఐపీఎల్ 19లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. లీగ్‌లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు తమ సొంతగడ్డపై చెక్ పెట్టి గెలుపు బాట పట్టాలని ముంబై భావిస్తోంది. మరోవైపు.. గెలుపు జోష్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైను చిత్తు చేసి ఫ్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.
హైదరాబాద్ కంటే ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఒక రకంగా చెప్పాలంటే డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదే. హైదరాబాద్‌పై గెలిస్తేనే పాండ్య సేన ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ముంబై ఆ తర్వాత ఆడే ఆరు మ్యాచుల్లో ఆరు తప్పక గెలివాల్సిందే. లేదంటే లీగ్ దశ నుంచి ఇంటి ముఖం పడుతోంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి.
ఒకవేళ హైదరాబాద్‌పై ముంబై ఓడిపోతే ఆ తర్వాత ఆడే ఆరు మ్యాచులకు ఆరు గెలవాల్సిందే. అలాగైతేనే 8 విజయాలతో పాండ్య సేకు టాప్-4 బెర్త్ ఖరారు అవుతుంది. ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడింది. అందులో కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ముంబై, ఎస్ఆర్‌హెచ్ హెడ్-టు-హెడ్ రికార్డ్:
ఈ కీలక పోరు వేళ ఐపీఎల్‌లో ముంబై, ఎస్ఆర్‌హెచ్ హెడ్-టు-హెడ్ రికార్డ్ ఓ పరిశీలిద్దాం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 25 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో ముంబై 14 సార్లు గెలుపొందగా.. ఎస్ఆర్‌హెచ్ 10 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే హైదరాబాద్‌పై ముంబైదే పై చేయి.
వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్:
బుధవారం (ఏప్రిల్ 29) ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలం. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో ఎక్కువగా టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేధించడానికి మొగ్గు చూపుతాయి. ముంబై, హైదరాబాద్ మ్యాచ్‌కు ఎలాంటి వాన ముప్పు పొంచిలేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.

