- కోర్టు కేసుల చిక్కులు లేకుండా ఉండేందుకు నిర్ణయం
- త్వరితగతిన ఫలితాల వెల్లడే లక్ష్యంగా ఏర్పాట్లు
- సిద్ధమవుతున్న వివిధ విభాగాల 20 నోటిఫికేషన్లు
హైదరాబాద్, వెలుగు: నియామక ప్రక్రియలో కోర్టు కేసులు, జాప్యానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తన విధానాన్ని మార్చింది. గతంలో అనుసరించిన ఉమ్మడి నోటిఫికేషన్ల విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఒక్కో కేటగిరీ పోస్టుకు విడివిడిగానే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా, కోర్టు కేసుల కారణంగా భర్తీ ప్రక్రియ మధ్యలో నిలిచిపోకుండా ఉండేలా ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది. అభ్యర్థుల విద్యార్హతలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.
కేసుల బెడద తప్పించేందుకే..
గతంలో ఒక్కో నోటిఫికేషన్‌లో 5 నుంచి 20 రకాల పోస్టులను కలిపి ఇచ్చేవారు. దీంతో ఏదైనా ఒక్క కేటగిరీ పోస్టుకు సంబంధించి అర్హతలు లేదా ఇతర అంశాలపై ఎవరైనా కోర్టుకు వెళ్తే, ఆ నోటిఫికేషన్‌లోని మిగతా అన్ని పోస్టుల ఫలితాలు ఆగిపోయేవి. ఫలితంగా వేల సంఖ్యలో అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఈ తలనొప్పి లేకుండా ఉండేందుకు.. ఇప్పుడు ఒక్కో నోటిఫికేషన్‌లో ఒకటి లేదా రెండు రకాల పోస్టులను మాత్రమే పొందుపర్చాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. దీంతో కేసుల సమస్య ఉండదని, ఒకవేళ ఏమైనా వచ్చినా అది ఆ ఒక్క కేటగిరి పోస్టులకే పరిమితమవుతుందని కమిషన్ భావిస్తున్నది.
ఇంజినీరింగ్ పోస్టులు కూడా విడివిడిగానే..
గతంలో ఇంజినీరింగ్ విభాగంలో పోస్టులకు సంబంధించి ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగాలన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి విభాగానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు రానున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా పలు ఖాళీలు ఉన్నప్పటికీ, కేవలం ఒక కేటగిరీకి మాత్రమే ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. అదే బోర్డు నుంచి మరో రెండు, మూడు నోటిఫికేషన్లు విడివిడిగా రానున్నాయి.
ముందు పబ్లిక్ సెక్టార్.. ఆపై సర్కారు కొలువులు
నియామకాల్లో వేగం పెంచేలా టీజీపీఎస్సీ పక్కా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నది. ముందుగా మూడు, నాలుగు పబ్లిక్ సెక్టార్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీసీబీ, ఫారెస్ట్, మెడికల్ తదితర ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి.. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత నేరుగా ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలపై దృష్టి సారించనున్నారు. ఇలా మొత్తం 20 వరకు విడివిడి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్, రిజల్ట్స్ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేయవచ్చని కమిషన్ అధికారులు చెబుతున్నారు.

