భారత్ అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డీల్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. 2017 చట్టం ప్రకారం రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తుంటుంది. అయినప్పటికీ అమెరికా హెచ్చరికలను భారత్ ఖాతరు చేయకుండా డీల్ వ్యవహారంలో ముందుకెళ్తోంది.
ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ …అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. ఏ దేశం నుంచి ఏది కొనుగోలు చేయాలో, ఏది చేయకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసే అధికారం భారత్ కు ఉందని చెప్పారు. ఆయుధాల కొనుగోళ్లు అనేవి పూర్తిగా భారత్ సార్వభౌమాధికారమని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు.


