
పద్మారావునగర్, వెలుగు: కులగణన చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారం రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరైన జక్కని సంజయ్ కుమార్ ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. దాంతో బీసీ సంఘ నేతలు శనివారం రాత్రి 10.30 గంటలకు ఆయనను గాంధీ నుంచి అపోలో హాస్పిటల్కు తరలించారు. బీసీ నేతల ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెల్త్ బులెటిన్విడుదల చేయకుండా గాంధీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సంజయ్ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వాంతులు చేసుకున్నాడని, ఇక గాంధీలో ఉంటే బతకడని భావించి అపోలోకు తీసుకెళ్తున్నట్లు బీసీ నేతలు వీడియో విడుదల చేశారు. మరోవైపు, దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర పటేల్, సంజయ్ కుమార్ ను గాంధీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ శనివారం పరామర్శించారు.