అమెరికా మాట వినని వివిధ దేశాల నాయకులను చంపేయటం, వారిని పదవి నుంచి దింపేయటం చరిత్రలో చాలా సార్లు చూశాం. ప్రస్తుతం వెనిజులా, ఇరాన్ విషయంలో జరుగుతోంది కూడా అదే. అమెరికా తన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ CIA సహాయంతో దీని వెనుక కుట్రలు పన్నుతుందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హ్యాండిల్ చేసే విషయం అధ్యక్షుడు ట్రంప్ ఫెయిల్ అయ్యాడని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఖమేనీపై వ్యతిరేక అల్లర్లు సృష్టించి ఆ దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవటాని వేస్తున్న ప్లాన్స్ అస్సలు వర్కౌట్ కాకపోవటంతో ట్రంప్ రూటు మార్చినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై 25% అదనపు టారిఫ్ విధిస్తున్నట్లు చేసిన ప్రకటన వెనుక కేవలం వాణిజ్య కారణాలే లేవు.. భారీ రాజకీయ వైఫల్యం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్ నవ్‌రూప్ సింగ్ విశ్లేషణ ప్రకారం.. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ప్రస్తుతానికి విఫలమయ్యాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పట్టును సడలించలేక ట్రంప్ ఇప్పుడు ఆర్థిక యుద్ధానికి తెరలేపారు. దీంతో ప్రపంచానికి ఇరాన్ ని దూరం చేయాలని ట్రంప్ ప్లాన్ చేశారు. ఆర్థిక మూలాలను మరింత నాశనం చేయాలని దీని ద్వారా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
This is confirmation that Regime change in Tehran failed after Iran successfully jammed Starlink with Russia’s help and managed to control the protests down ! pic.twitter.com/NmcnKI8sLu
— Navroop Singh (@TheNavroopSingh) January 13, 2026
కొత్తగా ఏంటీ స్టార్‌లింక్ యాంగిల్?
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతమైన వేళ, అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఆ సమయంలో ప్రపంచానికి సమాచారం చేరవేయడానికి నిరసనకారులు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఉపయోగించటం స్టార్ట్ చేశారు. ఇరాన్‌లో సుమారు 50వేల స్టార్‌లింక్ యూనిట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే రష్యా సాయంతో ఇరాన్ చెక్ పెట్టింది. అత్యంత ఖరీదైన మిలిటరీ గ్రేడ్ జామింగ్ పరికరాలతో స్టార్‌లింక్ సిగ్నల్స్‌ను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంది. దాదాపు 80% డేటా ట్రాఫిక్‌ను నిలిపివేసి, నిరసనలను నియంత్రించగలిగింది. దీంతో అసలు ఖమేనీకి మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం అమెరికా అర్థం కాలేదు.
అసహనంతోనే ట్రంప్ 25% టారిఫ్..
డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఉపయోగించి ఖమేనీ ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోవడంతో.. ట్రంప్ ఇప్పుడు 'టారిఫ్' అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో సంబంధం ఉన్న ఏ దేశమైనా అమెరికాకు 25% పన్ను కట్టాల్సిందేనని హెచ్చరించారు. ఇది ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్ల వల్ల 50% టారిఫ్ ఎదుర్కొంటున్న భారత్ వంటి దేశాలపై పెను భారంగా మారనుంది.
చైనా, యూఏఈ వంటి దేశాలను కూడా ట్రంప్ టారిఫ్స్ ప్లాన్ ఇబ్బంది పెడుతోంది. మొత్తానికి ఇరాన్ అంతర్గత నిరసనలను అణిచివేయడం.. స్టార్‌లింక్ లాంటి అధునాతన సాంకేతికతను జామ్ చేయడంలో ఖమేనీ విజయం సాధించగా.. ఆ కోపాన్ని ట్రంప్ ఇలా ప్రపంచ దేశాలపై టారిఫ్ రూపంలో చూపిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది.
