రూ.960 కోట్ల జల్ జీవన్ మిషన్ స్కామ్..మాజీ మంత్రి మహేశ్ జోషి అరెస్టు

రూ.960 కోట్ల జల్ జీవన్ మిషన్ స్కామ్..మాజీ మంత్రి మహేశ్ జోషి అరెస్టు
  • మే 11 వరకు కస్టడీ విధించిన కోర్టు
  • లంచాలు తీసుకుని టెండర్లు కట్టబెట్టారని ఆరోపణ

జైపూర్‌‌‌‌‌‌‌‌: రాజస్తాన్‌‌‌‌లో సంచలనం సృష్టించిన రూ.960 కోట్ల జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అవినీతి కేసులో మాజీ మంత్రి మహేశ్ జోషిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం జైపూర్‌‌‌‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జోషికి మే11 వరకు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు జైపూర్ రైల్వే స్టేషన్  సమీపంలోని జోషి నివాసానికి వెళ్లారు. 

ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయంలో విచారించి, అధికారికంగా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మహేశ్​ జోషి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. ఇర్కాన్ సంస్థ జారీ చేసినట్టుగా నకిలీ కంప్లీషన్ సర్టిఫికెట్లను సృష్టించి, కొన్ని సంస్థలకు రూ.960 కోట్ల విలువైన టెండర్లు కట్టబెట్టారని దర్యాప్తులో అధికారులు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుని, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చినట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబోధ్ అగర్వాల్‌‌‌‌తో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు.  

నేను నిర్దోషిని: మహేశ్ జోషి

కోర్టుకు హాజరయ్యే ముందు మహేశ్ జోషి మీడియాతో మాట్లాడారు. తాను నిర్దోషినని తెలిపారు. ఇదే కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై 2025, ఏప్రిల్‌‌‌‌లో ఈడీ అధికారులు జోషిని అరెస్టు చేశారు. దాదాపు 7 నెలల జైలు శిక్ష తర్వాత గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న జోషిని విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.