మెల్‌బోర్న్: లెజెండరీ అథ్లెట్, వరల్డ్ ఫాస్టెస్ట్ స్ర్పింటర్‌గా చరిత్రకెక్కిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సరికొత్త లక్ష్యాన్ని ప్రకటించాడు. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో తాను తిరిగి పాల్గొనాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.. అయితే ఈసారి అథ్లెటిక్ ట్రాక్ పైన కాకుండా బ్యాట్, బాల్‌తో క్రికెట్ గ్రౌండ్‌లో దిగాలని ఆశపడుతున్నాడు.
తన దేశం జమైకా (వెస్టిండీస్ తరఫున) తరఫున చాన్స్ వస్తే మరోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏముంటుందని పేర్కొన్నాడు. నిజానికి ఉసేన్ బోల్ట్‌కు క్రికెట్ అంటే ప్రాణం. అథ్లెటిక్స్‌లోకి రాకముందు తను జమైకాలో ఓ ఫాస్ట్ బౌలర్ కావాలని కలలుగన్నాడు. తన చిన్నతనంలో క్రికెట్ కోచ్ సూచన మేరకే రన్నింగ్ వైపు మళ్లిన బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ‘నేను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, క్రికెట్ కోసం పిలుపు వస్తే మాత్రం తప్పకుండా సిద్ధంగా ఉంటాను’ అని బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించాడు. బోల్ట్ 2024 టీ20 వరల్డ్ కప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.
