న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు ఇండియా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్ భారత్‌తో విడదీయరాని భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేసేవన్నీ డొల్ల మాటలని.. నిరాధార ఆరోపణలతో వాస్తవాన్ని మార్చలేరని కౌంటర్ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం (జూన్ 5) ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భద్రతా మండలి వార్షిక నివేదికపై పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి, రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాకిస్థాన్ ఈ సమావేశానికి సంబంధం లేని ప్రస్తావన చేయడంపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పార్వతనేని హరీష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక విషయాన్ని గట్టిగా, స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్ గతంలోనూ, ఇప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగమే. భారత్‌తో విడదీయరాని భాగంగానే ఉంటుంది. దీనికి విరుద్ధంగా చేసే ఏ వాదనలైనా నిరాధారమైనవి, చారిత్రక వాస్తవాలకు విరుద్ధమైనవి. జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేసే డొల్ల మాటలు, డొల్ల వాదనలు ప్రాథమిక వాస్తవాన్ని మార్చలేవు’’ అని పాకిస్తాన్‌కు కౌంటర్ ఇచ్చారు.
పాకిస్తాన్ తమ విభజన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి వేదికలను దుర్వినియోగం చేస్తుందని నిప్పులు చెరిగారు. భద్రతా మండలిలో తన సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేయడం, తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం ఒక పెద్ద బాధ్యత అని.. ఇది పక్షపాత, తప్పుడు కథనాలను ప్రచారం చేసే వేదిక కాదని పాకిస్తాన్‌కు చురకలంటించారు.
