
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈ రోజు తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని లస్సీపొర ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ విషయం పసిగట్టిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు చేయడం ప్రారంభించారు.దీంతో భద్రత సిబ్బంది వారిపై ఎదురుకాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. సంఘటనా స్థలిలో భద్రతా బలగాలు రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నాయి.