జనగామ టికెట్ పల్లాకే.. ప్రకటించిన బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జనగామ టికెట్ పల్లాకే.. ప్రకటించిన బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • లక్ష ఓట్లతో గెలిపిస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • స్టేషన్​ఘన్​పూర్​లో విభేదాలకు ఫుల్​స్టాప్ 
  • సముచిత స్థానమిస్తామన్న హామీతో మెత్తబడ్డ రాజయ్య

హైదరాబాద్, వెలుగు: జనగామ టికెట్​పల్లా రాజేశ్వర్​రెడ్డికే ఇవ్వబోతున్నామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​క్లారిటీ ఇచ్చారు. మినిస్టర్స్​క్వార్టర్స్​లో మంగళవారం జనగామ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, జనగామ టికెట్​ఆశించిన మండల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్​ ఈ సమావేశంలో మాట్లాడుతూ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్​పదవి ఇచ్చామని, భవిష్యత్​లో మరింత గౌరవం కల్పిస్తామన్నారు.  ప్రజలు మూడోసారి కేసీఆర్​ను గెలిపించి రికార్డ్ ​సృష్టించాలని పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణను ఈనగాచి నక్కల పాలు చేయొద్దని, కాంగ్రెస్​ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో పెట్టొద్దన్నారు. కాంగ్రెస్​ లీడర్లు జనగామలో పాగా వేయాలని చూస్తున్నారని వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు. 

ఈనెల 16న జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కూడా ఈ సమావేశానికి పిలిపించి కేటీఆర్ మాట్లాడారు. ఘన్​పూర్​లో కడియం శ్రీహరి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో సముచిన స్థానం ఇస్తామని చెప్పారు. దీంతో కడియంతో కలిసి పనిచేస్తానని రాజయ్య ఆయనకు తెలిపారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ, 16న నిర్వహించే జనగామ ఎన్నికల ప్రచార సభ దద్దరిల్లాలని.. 70 వేల మందిని ఈ సభకు తరలించాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ జనగామ నియోజకవర్గాన్ని కాంగ్రెస్​పాలు కానియ్యనన్నారు. 

జనగామలో బీఆర్ఎస్​కు 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీ వస్తదని సర్వేలు చెప్తున్నాయని, అంత మెజార్టీ సాధించి కేసీఆర్​కు కానుక ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ, 16న కేసీఆర్​బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశానికి జనగామ నుంచి టికెట్ ఆశించిన నాగపురి కిరణ్​కుమార్​గౌడ్, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం​హాజరు కాకపోడం గమనార్హం..