జమ్మూకు 47.. కాశ్మీర్​కు 43 సీట్లు

జమ్మూకు 47.. కాశ్మీర్​కు 43 సీట్లు
  • అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులు చేర్పులు పూర్తి 
  • తుది నివేదిక అందజేసిన డీలిమిటేషన్ కమిషన్ 

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ యూనియన్ టెరిటరీ (యూటీ)లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ గురువారం తుది నివేదికను విడుదల చేసింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జమ్మూ ప్రాంతానికి 47, కాశ్మీర్ కు 43 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. ప్రస్తుతం మొత్తం 83 సీట్లు ఉండగా.. జమ్మూలో 6, కాశ్మీర్ లో ఒక సీటును పెంచింది. మొత్తం 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ప్రతి దాంట్లోనూ 18 వచ్చేలా అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులు చేపట్టింది. తొలిసారి ఎస్టీలకు 9 సీట్లు రిజర్వ్ చేసింది. వీటిలో 6 జమ్మూలో, 3 కాశ్మీర్ లో ఉన్నాయి. ఎస్సీలకు 7 సీట్లను కేటాయించింది. కాశ్మీర్ లోని అనంతనాగ్ పార్లమెంట్ నియోజకవర్గంలో జమ్మూలోని రాజౌరీ, పూంచ్ అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపింది. స్థానికుల డిమాండ్ మేరకు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను మార్చింది. కాశ్మీరీ పండిట్లు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి వచ్చిన నిర్వాసితులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని, వాళ్లకు నామినేషన్ పద్ధతిలో సీట్లు కేటాయించాలని కమిషన్ సూచించింది. కాగా, జమ్మూకాశ్మీర్  నియోజకవర్గాల మార్పుల కోసం 2020 మార్చిలో కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.