దాహం తీరుస్తున్నరు.. వన్యప్రాణుల కోసం నీటి సౌలతి

 దాహం తీరుస్తున్నరు.. వన్యప్రాణుల కోసం నీటి సౌలతి
  • కవ్వాల్​ ఫారెస్ట్​ జన్నారం డివిజన్​లో 187 నీటికుంటలు
  • 4 చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 70 సాసర్​ వెల్స్​
  • 30 ర్యాంపు వెల్స్​, 24 సోలార్​ పంపుల ఏర్పాటు  

జన్నారం, వెలుగు: ఎండాకాలంలో వన్యప్రాణుల దాహన్ని తీర్చేందుకు ఫారెస్ట్​ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఇందన్​పల్లి, జన్నారం, తాళ్లపేట రేంజ్​లలో తగిన నీటి వసతులు కల్పించడం వల్ల అటవీ జంతువులు గతంలో మాదిరిగా జనావాసాల్లోకి రావడం చాలా వరకు తగ్గింది. జన్నారం డివిజన్​లో 2019లో నాలుగు చదరపు కిలోమీటర్లకు ఒక సాసర్ వెల్ చొప్పున 70 వెల్స్​ (నీటితొట్టిలు) ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ ఎండాకాలంలో నీళ్లు నింపుతున్నారు. సాసర్​ వెల్స్​ కొత్తగా ఏర్పాటు చేయనప్పటికీ పాత వాటినే వినియోగిస్తున్నారు. 30 ర్యాంపు వెల్స్, 24  సొలార్ పంపులు ఏర్పాటు చేశారు. జన్నారం డివిజన్ పరిధిలో 187 నీటికుంటల్లో నీటిని నింపుతున్నారు. 

వన్యప్రాణులు కుంటల్లో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. వీటితోపాటు ఒక చెక్ డ్యామ్, మరో ఐదు చోట్ల వాగులకు అడ్డంగా కట్టలు కట్టి నీరు నిలిచేలా ఏర్పాట్లు చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా అటవీ ప్రాంతం నుంచి పైపులైన్ వెళ్తున్నందున జన్నారం డివిజన్​లో 19 చోట్ల నీటిని కుంటల్లో వాడుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే జింకల పునరావాస కేంద్రం వద్ద భగీరథ నీటిని వన్యప్రాణులకు వినియోగిస్తున్నారు. దీంతో అటవీ జంతువులకు నీటి కొరత తీరింది. బేస్​క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు ప్రతీరోజు కుంటల్లో నీరు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నీటికుంటల్లో నీరు ఉండడం వల్ల రానున్న ఏప్రిల్, మే నెలల్లో సాసర్ వెల్స్​లో నీటిని నింపడానికి చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క కడెం కెనాల్ నీటిని సైతం వన్యప్రాణుల కోసం ఉపయోగిస్తున్నామని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.

నీటి కొరత లేకుండా చూస్తున్నాం.. 

వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. డివిజన్​లో ఉన్న నీటికుంటల్లో ఎప్పుడూ నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సోలార్ పంపులతో కుంటలను నింపడమే గాకుండా అడవిలో ఏర్పాటు చేసిన సాసర్ వెల్స్​లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతాం. నీటి కోసం వచ్చే వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశాం. డివిజన్​లో కొన్ని సోలార్ పంపులు పనిచేయడం లేదు. వాటికి రిపేర్లు చేస్తున్నాం. - రామ్మోహన్, ఎఫ్​డీవో, జన్నారం