జంతర్ మంతర్‌‌‌‌ క్లోజ్..ఇకపై నిరసనలకు కుదరదన్న కేంద్ర హోంశాఖ

జంతర్ మంతర్‌‌‌‌ క్లోజ్..ఇకపై నిరసనలకు కుదరదన్న కేంద్ర హోంశాఖ
  • రామ్‌‌‌‌లీలా, బురారీ, సీబీడీ గ్రౌండ్స్‌‌‌‌లోనే ఇక ధర్నాలు
  • పార్లమెంట్‌‌‌‌కు 4 నుంచి 15 కి.మీ. దూరంలో వేదికలు
  • కొత్త వేదికలకు ఇంకా విడుదల కాని ఎస్‌‌‌‌ఓపీ
  • ఢిల్లీలో ప్రతి చోటూ ఇక జంతర్ మంతరే
  • ఇది ‘డెమోకుర్సీ’: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ 

న్యూఢిల్లీ : దశాబ్దాలుగా దేశ రాజధానిలో నిరసనలకు ప్రధాన వేదికగా నిలిచిన జంతర్ మంతర్‌‌కు ఢిల్లీ పోలీసులు తాళం వేశారు. జంతర్ మంతర్‌‌ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగిస్తూ (డీ నోటిఫై) సోమవారం కేంద్రం ప్రకటించింది. ఆ స్థానంలో జంతర్ మంతర్‌‌కు సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని రామ్‌‌లీలా గ్రౌండ్, 15 కిలోమీటర్ల దూరంలోని బురారీ గ్రౌండ్, 13 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌‌లను కొత్త వేదికలుగా కేటాయించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11 తేదీతో స్టాండింగ్ ఆర్డర్ జారీ చేశారు.

ప్రజల నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డర్‌‌లో పేర్కొన్నారు. కొత్త వేదికల్లో ధర్నాల నిర్వహణకు సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌‌ఓపీ)ను విడిగా జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే అవి ఇంకా విడుదల కాకపోవడంతో, కొత్త విధానంలో నిరసనలు ఎలా జరగాలనే దానిపై స్పష్టత రాలేదు. 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్ నంబర్ ఎల్&ఓ/48/22ను ఈ నిర్ణయం పాక్షికంగా సవరించింది.

నిరసనలకు తగిన స్థలం కల్పిస్తూనే, స్థానికులకు, ట్రాఫిక్‌‌కు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆ ఆర్డర్‌‌లో జంతర్ మంతర్‌‌ను నిరసనల వేదికగా గుర్తించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే ధర్నాలకు అనుమతిస్తూ, ఏ కార్యక్రమమైనా ఒక్క రోజుకు మించి కొనసాగకూడదని అప్పట్లో ఆంక్షలు విధించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌‌ఐఆర్) వివాదంపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న వేళ ఈ నిర్ణయం వెలువడింది.  

33 ఏండ్లుగా ఉద్యమాలకు కేంద్రం 

జంతర్ మంతర్ పుట్టింది నిరసనల కోసం కాదు. గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు 1724లో మహారాజా జైసింగ్-2 దీన్ని ఖగోళ అబ్జర్వేటరీగా నిర్మించారు. చారిత్రక అబ్జర్వేటరీ, నిరసనలు జరిగే ప్రాంతం వేర్వేరు. పక్కనే ఉన్న రోడ్డు క్రమంగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలనుకునే పౌరులకు ప్రధాన కేంద్రంగా మారింది.

జంతర్ మంతర్ కంటే ముందు నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌‌లకు సమీపంలోని బోట్ క్లబ్ లాన్స్‌‌లో నిరసనలు జరిగేవి. 1975లో జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ క్రాంతి’ సభ కూడా బోట్ క్లబ్‌‌లోనే జరిగింది. 1988లో రైతు నేత మహేంద్ర సింగ్ టికాయత్ నేతృత్వంలో వేలాది మంది రైతులు సెంట్రల్ ఢిల్లీలో భారీ ఆందోళన చేపట్టిన తర్వాత బోట్ క్లబ్‌‌లో నిరసనలపై ఆంక్షలు విధించారు. దీంతో 1993లో జంతర్ మంతర్ ఢిల్లీ అధికారిక నిరసన వేదికగా మారింది.