కుమామోటో(జపాన్): ఇండియా స్టార్ షట్లర్లు హెచ్.ఎస్. ప్రణయ్, లక్ష్యసేన్ మరో సవాల్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే జపాన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సేన్, ఆ తర్వాత డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. ఈ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న లక్ష్యసేన్.. తిరిగి విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నాడు.
తొలి రౌండ్‌లో లోకల్ ప్లేయర్, వరల్డ్ 25వ ర్యాంకర్ వతానబే రూపంలో సేన్‌కు ఆదిలోనే కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇక గాయం నుంచి కోలుకున్న ప్రణయ్.. ఇండోనేసియా షట్లర్ జున్ హావో లియాంగ్‌తో తలపడనున్నాడు. సింగిల్స్‌లో ఆయూశ్ శెట్టి, మన్నెపల్లి తరుణ్, కిరణ్ జార్జ్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్వికా శివానీ కూడా బరిలో నిలిచారు.
