సింధుకు సవాల్‌‌‌‌.. నేటి నుంచి జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌

సింధుకు సవాల్‌‌‌‌..  నేటి నుంచి జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌

టోక్యో: ఈ ఏడాది ఒక్క టైటిల్‌‌‌‌ కూడా నెగ్గని ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు మరో టోర్నమెంట్‌‌‌‌కు రెడీ అయింది. మంగళవారం మొదలయ్యే  జపాన్ ఓపెన్‌‌‌‌ సూపర్ 750 టోర్నమెంట్‌‌‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  ఈ సీజన్‌‌‌‌లో ఆడిన 12 బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఈవెంట్లో ఆమె ఆరింటిలో ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే ఓడింది.  ఒలింపిక్స్‌‌‌‌కు సరిగ్గా ఏడాది ఉండగా సింధు గాడిలో పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌‌‌‌లో తను చైనాకు చెందిన  జాంగ్‌‌‌‌ యి మన్‌‌‌‌తో పోటీ పడనుంది. మేలో జరిగిన మలేసియా ఓపెన్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో సింధు ఆమెపై గెలిచింది. 

20వ ర్యాంకర్‌‌‌‌ జాంగ్‌‌‌‌పై గెలిచి ముందుకెళ్తే  తై జుయింగ్‌‌‌‌ రూపంలో మరోసారి తెలుగు షట్లర్‌‌‌‌కు కఠిన సవాల్‌‌‌‌ ఎదురవనుంది. మాళవిక, ఆకర్షి కశ్యప్​ కూడా బరిలో నిలిచారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌గా బరిలోకి దిగుతున్న ప్రణయ్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ లి షి ఫెంగ్‌‌‌‌ (చైనా)తో తలపడనున్నాడు. శ్రీకాంత్‌‌‌‌.. చైనీస్‌‌‌‌ తైపీకి చెందిన చో తైన్‌‌‌‌ చెన్‌‌‌‌తో పోటీ పడతాడు. లక్ష్యసేన్‌‌‌‌ ఇండియాకే చెందిన ప్రియాన్షు రజావత్‌‌‌‌తో పోరు ఆరంభించనున్నాడు. 

కొరియా ఓపెన్‌‌‌‌తో ఈ సీజన్‌‌‌‌లో నాలుగో టైటిల్‌‌‌‌ అందుకున్న ఇండియా డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్లు సాత్విక్‌‌‌‌సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.   తొలి రౌండ్‌‌‌‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ-–డేనియల్ తో పోరు ఆరంభించనున్నారు. ఎంఆర్‌‌‌‌ అర్జున్‌‌‌‌–ధ్రువ్‌‌‌‌ కపిల ద్వయం, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో గాయత్రి–ట్రీసా జాలీ, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో సిక్కిరెడ్డి–రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌ కూడా పోటీలో ఉన్నారు.