తెలంగాణలో మావోయిస్టులు ఆరుగురే: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో మావోయిస్టులు ఆరుగురే: డీజీపీ శివధర్ రెడ్డి
  • 50 మంది ఉన్నారనేది అవాస్తవం: డీజీపీ
  • నేడు కర్రెగుట్టలపై పోలీస్​బాస్ ఏరియల్​ సర్వే 
  • దశాబ్దాలుగా మవోయిస్టులు ప్రాబల్యం ఉన్న పామునూరు గ్రామంలో పర్యటన

యాదాద్రి/ వెంకటాపురం, వెలుగు:  రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఆరుగురు మావోయిస్టులే ఉన్నారని డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సోమవారం ‘భరోసా సెంటర్’ ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంకా 50 మంది మావోయిస్టులు ఉన్నారన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. అప్పుడెప్పుడో 50 మంది ఉండే.. ఇప్పుడు ఆరుగురు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. పోలీసుల ప్రమోషన్లపై మాట్లాడుతూ కోర్టు కేసులు ఉంటే తప్ప పోలీసు డిపార్ట్​మెంట్​లో ప్రమోషన్లు ఎన్నడూ ఆగలేదన్నారు. ఖాళీలు, అర్హత బట్టి ప్రమోషన్లు వస్తాయని, పది పదిహేను ఏండ్లు డ్యూటీ చేశామంటే రావన్నారు.


దాడులు, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, పిల్లలకు న్యాయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అన్ని విషయాలు చెప్పలేరని అందుకే ఈ సెంటర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంటర్ల నిర్వహణ, మానిటరింగ్ మొత్తం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అకాంక్ష్ యాదవ్ పాల్గొన్నారు.
కర్రెగుట్టల్లో డీజీపీ ఏరియల్​ సర్వే తెలంగాణ-, చత్తీస్​గఢ్ సరిహద్దులో ఉన్న ములు గు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఏరియల్​సర్వే చేయనున్నారు. అనంతరం వెంకటాపురం  పోలీస్​ స్టేషన్​లో ఉన్నతాధికారులతో హైలెవల్​ మీటింగ్​ నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న కర్రెగుట్టల్లోని పామునూరు గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు. ఇటీవలే మురుమూరు నుంచి పామునూర్ గుట్టపైకి రోడ్డు నిర్మించి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులకు ఆటో, టూ వీలర్ లు పంపిణీ చేయనున్నారు. తడపల గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. డీజీపీతో పాటు సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏడీ ఇంటెలిజెన్స్ విజయకుమార్, సీసీఎఫ్ సువర్ణ తదితరులు ఈ పర్యటనలో 
పాల్గొననున్నారు. మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫిట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతి తెలిపారు.  ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా 
హాజరవుతారు.