మళ్లీ గడీల పాలన రానియ్యం.. 2034 వరకు మా ప్రజా ప్రభుత్వమే: సీఎం రేవంత్

మళ్లీ గడీల పాలన రానియ్యం..  2034 వరకు మా ప్రజా ప్రభుత్వమే: సీఎం రేవంత్
  • కొందరు మాయగాళ్లు మారీచుల రూపంలో వస్తున్నరు 
  • ఇది చేయలే, అది చేయలే అని మాట్లాడుతున్నరు
  • పదేండ్లు మీరు వెలగబెట్టలేని ఎన్నో గొప్ప పనులు మేం చేసినం
  • మీ సభలు ఉంటే ప్రతిపక్షాలను పోలీస్​స్టేషన్లలో పెట్టేది
  • మేం ప్రతిపక్షాలను సభలకు పిలిచి సమస్యలపై మాట్లాడిస్తున్నం
  • మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి ఉన్న తేడా అది 
  • ఆదిలాబాద్​లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సభ
  • రూ.1,238 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆదిలాబాద్, వెలుగు: ఆనాడు నిజాం గడీలను బద్దలు కొట్టిన ప్రాంతంలో మళ్లీ గడీల పాలన రానియ్యమని, రాక్షస పాలన జరగనివ్వమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆదిలాబాద్​జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రూ.1,238 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భట్టి విక్రమార్క పిప్రి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారని, అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకే ఈ బహిరంగ సభ పెట్టామని చెప్పారు.  


అపార ఖనిజ సంపద ఉన్న ఆదిలాబాద్ జిల్లా గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిందని సీఎం చెప్పారు. జిల్లాలో ఇప్పటికీ పూరి గుడిసెలున్నాయని, ఇంకా తాగునీటి సమస్య ఉందన్నారు. గతంలో తాను ఇక్కడ  పర్యటించినప్పుడు గమనించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.‘ఈ రాష్ట్రం మనది. ఈ ప్రజలు మనవాళ్లు. నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబ సభ్యులే. మాకు తారతమ్యం లేదు. కులమతాల్లేవ్. ప్రభుత్వ ఆదాయం పెంచాలి. పేదలకు పంచాలి అనుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తున్నాం’  అని సీఎం తెలిపారు. కానీ, కొందరికి తాము చేసే పని నచ్చడం లేదని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి అన్నారు. ‘కొందరు మాయగాళ్లు మాయలేడి రూపంలో మారీచుల్లా వస్తున్నరు. నిన్న మొన్న కొడంగల్ పోయిండ్రు. మహేశ్వరం పోయిండ్రు. మార్కెట్ యార్డు కట్టలేదు అంటున్నరు. పదేండ్లు మీరెందుకు కట్టలేదని నేను అడుగుతున్న. పదేండ్లు మీరు వెలగబెట్టలేని ఎన్నో గొప్ప పనులు మేం చేసినం. ఇంకా చేస్తం’ అని అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ఇలా ఊరుఊరు తిరగడం ఎందుకన్నారు. ‘మీకు ఓపికా ఉండాలేకదా.. మీ సభలు ఉంటే ప్రతిపక్ష నేతలను పోలీస్ స్టేషన్​లో పెట్టేది. మేము ప్రతిపక్షాలను సభలకు పిలిచి సమస్యలపై మాట్లాడిస్తున్నం. శాసన సభలో, శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవాడానికి అవకాశం ఇస్తున్నం. మీ ప్రభుత్వానికి, మాప్రభుత్వానికి ఉన్న తేడా అదే. గత పదేండ్లలో ఈ సంస్కృతి ఎక్కడైనా చూశారా? ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధిలో అందరిని కలుపుకుపోతం. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదికలా, ఈ దేశానికి ఆదర్శంగా నిలబడేలా చేయాలనేదే మా లక్ష్యం’ అని సీఎం చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులే కానీ.. శత్రువులు కాదని అన్నారు. ‘మీరు అసెంబ్లీకి రారు.. ప్రజల సమస్యలపై మాట్లాడరు. ఎప్పుడూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే చేస్తారు’ని ప్రధాన ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విమర్శించారు. 

ఆదివాసీల కోసం 25 వేలు అదనపు ఇండ్లు 

‘రాష్ట్రంలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆడబిడ్డల కండల్లో ఆనందం చూస్తున్నం. ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల కోసం 25 వేలు అదనపు ఇండ్లు మంజూరు చేసినం. ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో చేశాం. ప్రస్తుతం దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. అందుకే 3.15 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నం.  గతంలో దొడ్డు బియ్యం పథకంలో దళారులు దందా చేశారు. డీలర్లు దొడ్డు బియ్యం పక్కదారి పట్టించారు’ అని  సీఎం రేవంత్​ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మీద తనకు ప్రత్యేక అభిమానం ఉందని, తన సొంత జిల్లాను అభివృద్ధి చేసినట్టుగా ఆదిలాబాద్ ను కూడా అభివృద్ధి చేస్తానని, ప్రతి రెండు నెలలకోసారి ఇక్కడి వస్తానని.. నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. బోథ్​ డివిజన్ సమస్యను పరిష్కరిస్తానన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయం విస్తరించేందుకు రూ.225 కోట్లు  మంజూరు చేశామని, అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంచిర్యాలలో సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధికి సంబంధించి  ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. వచ్చే డిసెంబర్ లో ఆడబిడ్డలకు చిలక పచ్చరంగులో చీరలు అందిస్తామన్నారు. యువత మత్తు వదలి.. ఆటలవైపు మొగ్గు చూపేలా క్రీడలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో క్రీడా మైదానం మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి జూపల్లిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్  మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్  మహేశ్ గౌడ్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, ప్రభుత్వ సలహదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్,  బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్  పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప నలు చేశారు. అడేగం గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌, బోథ్ మండలం పొచ్చెరలో రూ.45 కోట్లతో ఏటీసీ సెంటర్, నాగోబా దేవస్థానం అభివృద్ధికి రూ.20.10 కోట్లు, ఆదిలాబాద్​లో రూ.20 కోట్లతో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల భవనం, ఉట్నూర్​లో రూ. 15 కోట్లతో ఐటీడీఏ కొత్త భవనం, రూ. 30 కోట్లతో ఇచ్చోడ నుంచి డెడ్రా గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. సిరికొండ మండలం కొండా పూర్​లో రూ. 13.46 కోట్లతో కొత్తగా నిర్మిం చిన వంతెనను ప్రారంభించారు. రూ.20 కోట్లతో జైనథ్​లో మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని ప్రార  భించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో వివిధ  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బోథ్ సెగ్మెంట్​లో 8.99 కోట్లతో ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్​లో మూడు 33/11కేబీ విద్యుత్ సబ్​స్టేషన్ల నిర్మా ణం, రూ.50.70 కోట్లతో పిప్రిలో ఎత్తిపోతల పథకం, రూ.44.64 కోట్లతో తేజాపూర్ ఎత్తి పోతల పథకం, రూ.65.85 కోట్లతో ఇంద్రవె ల్లి మండలంలో ముత్నూర్​లో చిన్న లిఫ్ట్ ఇరి గేషన్ పథకం, ఆదిలాబాద్ సెగ్మంట్​లో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర రూ.6.43 కోట్లతో చెక్ డ్యాం, 31.52 కోట్లతో సిరికొం డ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణం, 11.76 కోట్లతో ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన చేశారు.  

రాష్ట్రానికి సీఎం తండ్రిలాంటోడు

సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లలో నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్, రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. బోథ్​ను రెవెన్యూ డివిజన్  చేయాలి. నియోజకవర్గ కేంద్రంలో ఫోర్ లేన్  రోడ్, సెంట్రల్  లైటింగ్ కు రూ.40 కోట్లు ఇవ్వాలి. ఇచ్చోడ లో సీహెచ్​సీ మంజూరు చేయాలి. సుంకిడిలో కొత్త మార్కెట్  కమిటీ ఏర్పాటు చేయాలి. ‌‌          - అనిల్ జాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (బోథ్)


ప్రాణహిత-చేవెళ్ల 
ప్రాజెక్టు ప్రారంభిస్తం
ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తం. ఈ జిల్లాకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు లేకున్నా రూ.1,250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎర్రబస్సు తిరుగుడే కష్టమైన ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్టు తెచ్చాం. జూన్ 2న ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మళ్లీ వస్త. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వడంతో పాటు.. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తం.
- సీఎం రేవంత్ రెడ్డి