- మరో మూడు విమానాల టేకాఫ్‌కు ఆలస్యం
- నెట్టుకుంటూ పక్కకు తొలగించిన రన్‌వే స్టాఫ్
శంషాబాద్, వెలుగు: టేకాఫ్ తీసుకుంటున్న టైమ్‌లో ఓ చార్టర్ఫ్లైట్రన్వేపై అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో గాల్లో తిరుగుతున్న రెండు విమానాలు కిందికి రాకుండా పైనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న పలు విమానాలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శంషాబాద్ఎయిర్పోర్టుకు రాయ్పూర్నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఐదుగురు ప్రయాణికులతో ఫ్లాప్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ చార్టర్ఫ్లైట్వచ్చింది.
ఈ విమానంలో బ్రిజ్కౌశిక్అనే పేషెంట్‌ను తీసుకువచ్చారు. ఈ విమానం మూడున్నర గంటలకు మళ్లీ రాయ్పూర్వెళ్లడానికి సిద్ధమైంది. ఇందులో ఇద్దరు పైలట్లతో ఓ పేషెంట్, ఓ డాక్టర్, మరొక వైద్య సిబ్బంది ఉన్నారు. రన్‌వేపై ప్రయాణం మొదలుపెట్టిన కొద్ది సెకన్లకే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆగిపోయింది. ఈ కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన రెండు విమానాలు ఐదు నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే, ఎయిర్‌పోర్ట్‌నుంచి బయలుదేరాల్సిన మరో మూడు విమానాలు ఆగిపోయాయి. కొద్దిసేపటికి చార్టర్ఫ్లైట్ను నెట్టుకుంటూ పక్కకు తొలగించి రన్‌వే క్లియర్‌చేశారు. దీంతో పైన తిరుగుతున్న రెండు విమానాలు సేఫ్‌గా ల్యాండ్అయ్యాయి.
