ట్యాంక్ బండ్, వెలుగు: నగరంలో రోజురోజుకు డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం లిబర్టీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఒక అంతర్జాతీయ నగరంలో ఇంత సులభంగా డ్రగ్స్ లభించడం చట్ట వ్యవస్థ వైఫల్యమేనని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో కూడా ఇవి అందుబాటులో ఉండటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ రాకెట్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బుర్ర రాము గౌడ్, మామిడి చెట్టు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
