నో ఏసీ, నో వైఫై..   ఓన్లీ ఆమ్దానీ..!..బస్ షెల్టర్లపై యాడ్ ఏజెన్సీల నిర్లక్ష్యం

నో ఏసీ, నో వైఫై..   ఓన్లీ ఆమ్దానీ..!..బస్ షెల్టర్లపై యాడ్ ఏజెన్సీల నిర్లక్ష్యం
  • టాయిలెట్, సీసీ కెమెరా, క్లీనింగ్​ సంగతి దేవుడెరుగు 
  • 18 చోట్లా ఇదే దుస్థితి  
  • రోడ్లపైనే ప్రయాణికుల వెయిటింగ్​
  • కొన్నింట దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు  
  • ఒక్కో స్టాప్ పై లక్షలు సంపాదిస్తున్న ఏజెన్సీలు  
  • నోరు మెదపని జీహెచ్​ఎంసీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఏసీ బస్​షెల్టర్లలో వసతులు కల్పించడంలో యాడ్ ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కేవలం అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం కోసమే వాటిని కొనసాగిస్తున్నాయి తప్పితే వాటి వల్ల ప్రయాణికులకు ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఐదారేండ్ల కింద బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్​ఫర్(బీఓటీ) పద్ధతిలో ఏసీ బస్​షెల్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 30 బస్​షెల్టర్లు ఏర్పాటు చేయాలని మూడు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు.

దీని ప్రకారం యాడ్​ఏజెన్సీలు బస్​షెల్టర్లపై ప్రకటనలు ఏర్పాటు చేసుకుని సంపాదించుకుంటాయి. దానికి బదులుగా షెల్టర్లలో వసతులు ఏర్పాటు చేయడంతో పాటు జీహెచ్ఎంసీకి ఒక్కో బస్​షెల్టర్​కు ఏడాదికి రూ.లక్ష ఇవ్వాలి. అయితే, కేవలం 18 ప్రాంతాల్లో మాత్రమే ఏజెన్సీలు బస్ షెల్టర్లను ఏర్పాటు చేశాయి. అగ్రిమెంట్​ప్రకారం బస్​షెల్టర్లలో ఏసీ, ఫ్యాన్, టాయిలెట్స్, వైఫై, సీసీ కెమెరా తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఏ ఒక్క ఏసీ బస్​షెల్టర్​లో ఆ ఫెసిలిటీస్ కనిపించడం లేదు. షెల్టర్లు క్లోజుడ్​గా ఉండడం, ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో బయటే నిల్చుంటున్నారు. ఎండ దంచుతున్నా తప్పనిపరిస్థితుల్లో బస్సుల కోసం ఎండలోనే  వెయిట్ చేస్తున్నారు. 

చెత్త, చెదారం.. 

కొన్ని ఏసీ బస్ షెల్టర్లలో చెత్తా చెదారం పేరుకుపోతోంది. శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసన భరించలేక  ప్రయాణికులు  బస్ షెల్టర్లలోకి వెళ్లడానికే వెనకడుగు వేస్తున్నారు. కొన్నింటికైతే ఎప్పుడూ తాళాలు వేసి ఉంటుండగా, సాయంత్రమైతే అన్నింటికి తాళాలు వేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఎండ తగ్గినా లోపల ఉండే పరిస్థితి లేకుండా పోయింది. బస్సులు ఆలస్యమైయితే బయట ఫుట్ పాత్ లపై కూర్చుంటున్నారు. 

రెంట్లకు ఇచ్చుకున్నరు

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు పక్కన ఉన్న బస్ స్టాప్ వద్ద ఆరు ఏసీ బస్ షెల్టర్లుండగా, రెండింటిని రూల్స్​కు విరుద్ధంగా ఏజెన్సీలు రెంట్​కు ఇచ్చుకున్నాయి. వీటి నుంచి నెలనెలా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ బస్​షెల్టర్లలో ఒక్క టాయిలెట్ కూడా లేదు. కానీ, ఈ షెల్టర్లపై ఏడు అడ్వర్టైజ్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేసి వాటి ద్వారా సంపాదిస్తున్నారు. ఈ ఏరియాలో ఒక్క షెల్టర్ పై యాడ్ కి కనీసం నెలకి రూ.2 నుంచి రూ.3లక్షలకుపైగానే ఉంది. ఇలా ఏడింటికి కలిపితే నెలకి దాదాపు కనీసం రూ.10 క్షలకుపైగానే ఆర్జిస్తున్నారు. కానీ, ఒప్పందం ప్రకారం ఎక్కడా బస్​షెల్టర్లలో సౌలతులు కల్పించడం లేదు. 

 ఎవరూ పట్టించుకోవట్లే..

ఏసీ బస్ షెల్టర్లలో యూనియాడ్స్, ప్రకాష్ యాడ్స్, మీడియా కార్ప్ ఏజెన్సీలు మేనేజ్​చేయాల్సి ఉంటుంది. వీరే  ఏసీలు, ఛార్జింగ్ పాయింట్లు, వై ఫై, సీటింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ, ప్రారంభించిన కొద్ది రోజులకే ఏసీలన్నీ పాడైపోయినా లైట్​తీసుకున్నారు. ఏండ్లుగా అవి పని చేయకపోయినా తమకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. లక్ష వస్తే చాలని బల్దయా చూస్తోంది. లైటింగ్, రెగ్యులర్​గా క్లీనింగ్ ముట్టుకోవడం లేదు. రాత్రి వేళ బస్ షెల్టర్లపై ఉన్న అడ్వర్టైజ్​మెంట్​బోర్డుల్లో లైట్లు వెలుగుతున్నా కింద షెల్టర్లలో మాత్రం చిమ్మ చీకటి రాజ్యమేలుతోంది. ఇప్పటికైనా  జీహెచ్ఎంసీ స్పందించి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.