తైవాన్ లో భూకంపంతో.. జపాన్ లో సునామీ.. తీరాన్ని తాకిన పెద్ద అలలు

తైవాన్ లో భూకంపంతో.. జపాన్ లో సునామీ.. తీరాన్ని తాకిన పెద్ద అలలు

తైవాన్ దేశాన్ని భారీ భూకంపం గడగడలాడించింది. పెద్ద పెద్ద భవనాలు సైతం కూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతగా నమోదు కాగా.. ఈ ప్రభావం జపాన్ దేశాన్ని సైతం వణికించింది. జపాన్ దక్షిణ ప్రాంతంలోని మియాకో, యయామా దీవుల్లో సునామీ ప్రభావం కనిపించింది. సాధారణం కంటే ఒక అడుగు ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఈ రెండు దీవుల్లోని తీర ప్రాంతం వైపు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సునామీ వల్ల ఎలా ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని జపాన్ దేశం ప్రకటించింది. తైవాన్ దేశంలోని హువాలియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read :తైవాన్లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

తైవాన్ భూకంపంతో జపాన్ దేశం అప్రమత్తం అయ్యింది. తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కంటే కొంచెం ఎక్కువగా సముద్రపు అలలు ఎగిసిపడ్డాయని.. అంత కంటే ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది జపాన్.  మియాకో, యయామా రెండు దీవుల్లోనే సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. ముందుకు వచ్చిందని.. అలలు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. 

తైవాన్ భూకంప తీవ్రతను అంచనా వేయటంలో గందరగోళం నెలకొంది. తైవాన్ దేశం 7.2 తీవ్రతగా స్పష్టం చేస్తే.. అమెరికా మాత్రం 7.4 తీవ్రతగా ప్రకటించింది. దీంతో భూకంప తీవ్రత విషయంలో రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేయటం విశేషం. ఏదిఏమైనా తైవాన్ మాత్రం ఈ భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. సహాయ చర్యలు ముమ్మరం అయ్యాయి.