హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాపించకుండా నిత్యం కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ కావ్య. కార్పొరేషన్లో కరోనా మహమ్మారి సోకకుండా రాత్రింబవళ్లు కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, కార్పొరేషన్ సిబ్బందికి అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ కావ్య వారితో కలిసి భోజనం చేశారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా రాత్రింబవళ్లు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే లాక్డౌన్ మొదలైనప్పటినుండి పేదలు, వలస కార్మికులు ఇబ్బందులు పడకూడదని నిత్యం నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న అయ్యప్ప సేవా సమితి వారిని మేయర్ అభినందించారు.

