ఓపెన్ కాస్ట్ ల్లో నిలిచిన ఉత్పత్తి.. ఉపరితల గనుల్లోకి చేరిన వరద

ఓపెన్ కాస్ట్ ల్లో నిలిచిన ఉత్పత్తి.. ఉపరితల గనుల్లోకి చేరిన వరద
  •   40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

జయశంకర్ భూపాలపల్లి/కోల్ బెల్ట్, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2, 3, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని నాలుగు ఓపెన్​కాస్ట్​మైన్లలో భారీ స్థాయిలో వరద చేరింది. లక్షలాది క్యూబిక్ మీటర్లకు పైగా ఓవర్ బర్డెన్ మట్టిని తొలగిస్తేనే టార్గెట్ మేరకు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.

 కానీ వాన కారణంగా మట్టి తొలగింపునకు ఇబ్బంది ఏర్పడడం, బ్లాస్టింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. వీటితో పాటు జెన్ కో చెందిన తాడిచర్ల ఓసీ నుంచి కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వానల కారణంగా భూపాలపల్లి ఏరియాలో 16 వేల టన్నులు, మంచిర్యాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 24 వేల టన్నులు కలిపి మొత్తం 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లుగా వెల్లడించారు. 

గురువారం సాయంత్రం వాన కాస్త తగ్గుముఖం పట్టడంతో భూపాలపల్లి ఏరియా గనుల్లో పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. కేటీకే ఓసీ 2లో చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు 300 హెచ్ పీ సామర్థ్యం కలిగిన ఎనిమిది మోటార్లను వినియోగిస్తున్నారు. అలాగే ఓసీ 3లో హేవీ కెపాసిటీ మోటార్లతో పంపింగ్ ను స్పీడప్ చేశారు. 

తాడిచర్ల ఓసీలో సైతం బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టారు. ఈ నెలలో వానల కారణంగా రెండు సార్లు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఏరియాలో నెలవారి ఉత్పత్తి లక్ష్యం తగ్గే అవకాశం కనిపిస్తోంది. మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​కాస్ట్​లో ఓబీ పనులు చేపడుతున్న ఎక్స్​ప్రెస్​వే సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ యాజమాన్యం భారీ వర్షాల నేపథ్యంలో కాంట్రాక్ట్​ కార్మికులకు శుక్ర, శనివారాలు సెలవులు  ప్రకటించింది.