పాకిస్తాన్ చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలు.. ఇస్లామాబాద్‎లో హై అలర్ట్

పాకిస్తాన్ చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలు.. ఇస్లామాబాద్‎లో హై అలర్ట్

ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో దాదాపు ఆరు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వంలోని ఇరాన్ టీమ్ శనివారం (ఏప్రిల్ 10) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‏లో ల్యాండ్ అయ్యాయి. 

ఇరాన్ ప్రతినిధి బృందానికి పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వాగతం పలికారు. ఇస్లామాబాద్‌లోని సెరీన్ హోటల్‌లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల ప్రతినిధి బృందాలు మొదట పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా సమావేశమవుతాయి. 

ఆ తర్వాత ప్రత్యక్ష చర్చలు జరుపుతాయి. అమెరికా‎ఇరాన్ శాంతి చర్చల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇస్లామాబాద్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం భారీ బలగాలను మోహరించారు. చర్చలు జరగనున్న సెరీన్ హోటల్ పరిసరాల్లో కర్ఫ్యూ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యుద్దాన్ని పూర్తిగా ముగించేందుకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా బృందాలు శాంతి చర్చలు జరపనున్నాయి.