57 మందితో జేడీయూ తొలి జాబితా.. ఎన్డీయే కూటమిలో కొత్త టెన్షన్‌‌‌‌

57 మందితో జేడీయూ తొలి జాబితా.. ఎన్డీయే కూటమిలో కొత్త టెన్షన్‌‌‌‌

పాట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 57 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) విడుదల చేసింది. ఈ జాబితాలో 30 మంది కొత్త క్యాండిడేట్లు, 27 మంది సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం జేడీయూ, లోక్‌‌‌‌ జన శక్తి(ఎల్జేపీ)తోపాటు మొత్తం ఐదు పార్టీలతో కలిసి బిహార్‌‌‌‌‌‌‌‌లో అధికారంలో ఉన్న ఏన్డీయే కూటమి.. ఇప్పటికే సీట్ల పంపిణీపై సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. 

కూటమి పార్టీల మధ్య ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి రాకముందే జేడీయూ బుధవారం తన అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌‌‌‌ కోరుతున్న 5 సెగ్మెంట్లకు కూడా నితీశ్‌‌‌‌ తన క్యాండిడేట్లను ప్రకటించారు. దీంతో కూటమిలో వివాదాలు ఇంకా కొలిక్కి రానట్టు తేలిపోయింది. నిజానికి పాశ్వాన్‌‌‌‌ అడుగుతున్న ఐదు సెగ్మెంట్లు అలౌలి, సోన్‌‌‌‌బర్సా, రాజ్‌‌‌‌గిర్‌‌‌‌‌‌‌‌, ఎక్మా, మోర్వాలో జేడీయూకు మంచి పట్టుంది. అందుకే ఆ సీట్లను ఎల్జేపీకి అప్పగించబోనని నితీశ్‌‌‌‌ తేల్చి చెప్పినట్లయింది.

సీట్ల పంపిణీ వివాదం కొలిక్కి వచ్చేనా..!

బీహార్‌‌‌‌‌‌‌‌లో 243 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఎన్డీయే కూటమి సీట్ల పంపిణీని దాదాపుగా ఖరారు చేసింది. బీజేపీ 101, జేడీయూ 101, ఎల్జేపీ 29, హిందూస్తానీ అవామ్‌‌‌‌ మోర్చా 6, రాష్ట్రీయ లోక్‌‌‌‌మోర్చాకు 6 సీట్ల చొప్పున కేటాయించాలని ఎన్డీయే నిర్ణయించింది. ఇందులో ఎల్జేపీ కోరుతున్న 5 సెగ్మెంట్లకూ జేడీయూ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు రాష్ట్రీయ లోక్‌‌‌‌మోర్చా చీఫ్‌‌‌‌ ఉపేంద్ర కుష్వాహా ఎన్డీయేపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లపై హైకమాండ్‌‌‌‌తో తేల్చుకునేందుకు బుధవారం ఆయన ఢిల్లీకి బయల్దేరారు.