V6 News

డి.పోచంపల్లిలో ట్రాన్స్‌ ఫార్మర్పై కరెంట్ షాక్..80 శాతం కాలిపోయిన లైన్ మెన్ శరీరం

డి.పోచంపల్లిలో ట్రాన్స్‌ ఫార్మర్పై కరెంట్ షాక్..80 శాతం కాలిపోయిన లైన్ మెన్ శరీరం
  •     చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగి    
  •     10 రోజుల వ్యవధిలో రెండు ఘటనలు
  •     ప్రమాదంపై అనుమానాలు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల డివిజన్ డి.పోచంపల్లిలో బుధవారం ఓ కంపెనీ ట్రాన్స్​ఫార్మర్ వద్ద రిపేర్లు చేస్తుండగా, లైన్ మెన్ నాగబాబు కరెంట్ షాక్​కు గురయ్యాడు. 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకుని స్తంభంపై పని చేస్తుండగా, ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో నాగబాబు మంటల్లో చిక్కుకుని కిందపడిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఎల్సీ తీసుకున్న తర్వాత సరఫరా ఎలా పునరుద్ధరించబడింది అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో.. ఎవరో కావాలనే విద్యుత్ ఆన్ చేశారని నాగబాబు అధికారులకు మొరపెట్టుకోవడం సంచలనంగా మారింది. పది రోజుల క్రితమే ఇదే సెక్షన్​లో శ్రీనివాసరావు అనే లైన్ మెన్ ఇలాగే మృతి చెందడం, ఇప్పుడు నాగబాబుకు ప్రమాదం జరగడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.