బాలాకోట్ మళ్లీ ఉగ్ర క్యాంప్: ఆత్మాహుతి దాడులకు 50 మంది రెడీ

బాలాకోట్ మళ్లీ ఉగ్ర క్యాంప్: ఆత్మాహుతి దాడులకు 50 మంది రెడీ
  • కశ్మీర్లో దాడులకు జైషే మహ్మద్ కుట్రలు
  • నిఘా వర్గాలకు అందిన సమాచారం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉగ్రస్థావరాలు మళ్లీ ప్రారంభమయ్యాయని భారత నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. అక్కడ దాదాపు 45 నుంచి 50 మంది ఉగ్రవాదులకు జైషే మహ్మద్ టెర్రరిస్టు గ్రూప్ ఆత్మాహుతి దాడులకు ట్రైనింగ్ ఇస్తోందని తెలిసింది. కశ్మీర్ తోపాటు భారత్ లోని పలు ఆర్మీ బేస్ లపై దాడులకు జైషే కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే ఉగ్ర సంస్థ చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మందికిపైగా జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన సరిహద్దు దాటి వెళ్లి పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించి.. టెర్రిరిస్టు క్యాంపులను నేలమట్టం చేసింది.

ఆ దాడి చేసిన తర్వాత కూడా టెక్నికల్ సర్వైలెన్స్ తోపాటు వివిధ మార్గాల ద్వారా అక్కడ ఏం జరుగుతోందన్న విషయాలను తెలుసుకుంటూనే ఉన్నామని భారత నిఘా వర్గాలు తెలిపాయి. దాదాపు ఆరు నెలల పాటు అక్కడ ఏ యాక్టివిటీ లేదని ఇటీవలే ఐఏఎఫ్ చీఫ్ చెప్పారు. ఇటీవల మళ్లీ అక్కడ ఉగ్రవాదుల యాక్టివిటీ మొదలైందన్నారు.

భారత్ లోని ఆర్మీ క్యాంపులపై దాడులు చేసేందుకు ఇప్పటికే కొంత మంది టెర్రరిస్టులను సరిహద్దు దాటించిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ జైషే 50 మంది ఉగ్రవాదులకు ఆత్మాహుతి దాడులు చేసేందుకు శిక్షణ ఇస్తోందని తాజాగా తెలిసింది. భారత్, అఫ్ఘాన్లపై దాడులకు వీరిని సిద్ధం చేస్తోందని సమాచారం అందింది.