జెట్‌‌ షేర్‌‌ 40 శాతం డౌన్‌‌ : వరుసగా 12వ రోజూ పతనం

జెట్‌‌ షేర్‌‌ 40 శాతం డౌన్‌‌ : వరుసగా 12వ రోజూ పతనం

ముంబైజెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ వరుసగా 12వ రోజూ పతనం నుంచి తప్పించుకోలేకపోయింది. మంగళవారం సెషన్లో ఇది 40.79 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ఒకానొకదశలో 53 శాతం పడిపోయిన షేరు ట్రేడింగ్‌‌ ముగిసే సమయానికి కొద్దిగా కోలుకొని రూ.40.50వద్ద ముగిసింది . గత ఏడు రోజుల్లో ఈ స్టాక్‌‌ 73 శాతం పడిపోయింది. అప్పుల కారణంగా గత ఏప్రిల్‌‌ నుంచి మూతబడ్డ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌లో వాటాల అమ్మకానికి ఎస్‌‌బీఐ నేతృత్వంలోని లెండర్ల కన్సార్షియం చేసిన ప్రయత్నం విఫలమైంది. జెట్‌‌ బ్యాంకులకు రూ.8,400 కోట్ల అప్పులు చెల్లించాలి. దీనిని పునరుద్ధరించేందుకు ఇన్వెస్ట్‌‌ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని లెండర్లు సోమవారం ప్రకటించారు. సమస్య పరిష్కారం కోసం ఎన్సీఎల్టీలో కేసు వేసినట్టు వెల్లడించారు. గ్రాంట్‌‌ థార్న్‌‌టన్‌‌కు చెందిన ఆశిష్‌‌ చచరియాను పరిష్కార నిపుణుడిగా నియమించాలని ఎస్‌‌బీఐ ప్రతిపాదించింది.

‘‘జెట్‌‌ సమస్యపై చర్చించడానికి సోమవారం లెండర్ల సమావేశం నిర్వహించాం. ఐబీసీ ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఎన్సీఎల్టీని కోరుతాం. ఎందుకంటే, జెట్‌‌లో వాటాల కొనుగోలుకు ఒకే కండిషనల్‌‌ బిడ్‌‌ దాఖలయింది’’ అని కన్సార్షియం చేసిన ప్రకటన పేర్కొంది. జెట్‌‌లోని మైనారిటీ వాటాదారు ఎతిహాద్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ షరతులతో కూడిన బిడ్‌‌ సమర్పించింది. సంస్థ పునరుద్ధరణకు రూ.15 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.1,700 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేస్తామని తెలిపింది. మెజారిటీ వాటాలను కొనే వాళ్లను వెతుక్కోవాల్సిన బాధ్యత లెండర్లదేనని స్పష్టం చేసింది. ఓపెన్‌‌ ఆఫర్‌‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మినహాయించాలని కోరింది. ఈ షరతులకు లెండర్లు అనుమతించలేదు. అప్పుల సమస్యను ఎన్సీఎల్టీ బయటే పరిష్కరించుకోవాలని జెట్‌‌ ఎయిర్వేస్‌‌, బ్యాంకర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి.   రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌ 17 నుంచి జెట్‌‌ను మూసివేశారు. హిందుజాతో కలిసి కంపెనీని పునరుద్ధరించాలని ఒకదశలో ఎతిహాద్‌‌ భావించినా, ఇందుకోసం లాంఛనంగా ప్లాన్‌‌ను మాత్రం సమర్పించలేదు.

నేటి నుంచి విచారణ

జెట్‌‌ దివాలా ప్రక్రియ మొదలుపెట్టాలంటూ ఎస్‌‌బీఐ నేతృ      త్వంలోని 26 బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌‌పై బుధవారం ఎన్సీఎల్టీలో విచారణ జరగనుంది. నరేశ్‌‌ గోయల్‌‌ 25 ఏళ్ల క్రితం దీనిని ప్రారంభించారు. ఏప్రిల్‌‌లో ఈ సంస్థ మూతపడటంతో 100పైగా విమానాలను వాటి యజమానులు తీసుకెళ్లారు. బ్యాంకులకు రూ.ఎనిమిది వేల కోట్లకుపైగా అప్పులు చెల్లించాల్సిన జెట్‌‌.. తన వెండర్లకు, విమాన యజమానులకు రూ.10 వేల కోట్లు, ఉద్యోగులకు  రూ.మూడు వేల కోట్లు ఇవ్వాలి. గత కొన్నేళ్ల నుంచి వస్తున్న నష్టాలు రూ.13 వేల కోట్లకు చేరాయి. జెట్‌‌కు చెందిన డొమెస్టిక్‌‌, ఇంటర్నేషనల్‌‌ స్లాట్లను అధికారులు ఇతర కంపెనీలకు కేటాయించారు. దీని దగ్గర ప్రస్తుతం రూ.ఐదు వేల కోట్ల విలువైన 16 విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే అశోక్‌‌ చావ్లా, శరద్‌‌ శర్మ అనే ఇద్దరు డైరెక్టర్లు జెట్ బోర్డు నుంచి వైదొలిగారు. వీరి రాజీనామా సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని కంపెనీ స్టాక్‌‌ ఎక్స్‌‌చేంజీలకు సమాచారం ఇచ్చింది.