రాంచీ: జార్ఖండ్ లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదనే మిగులుతోంది. జార్ఖండ్ కు చెందిన ఒక దినసరి మహిళా కూలీ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయింది.
15 రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేసినప్పటికీ కేవలం 200 రూపాయలు ఇచ్చారని ఒక మహిళా కూలీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నెటిజన్లు గుండెను బరువెక్కించాయి. తనకు చిన్న పిల్లలు ఉన్నారని.. రూ.200 ఇస్తే తామేం తినాలని, పిల్లలను ఎలా పోషించాలని ఆమె కంటతడి పెట్టుకున్నది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉండే కూలీలకు కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం, రోజుకు దాదాపు రూ.13 కూలీనే ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పనికెళితే.. పురుషులకు రూ.500, మహిళలకు రూ.400 కూలీ ఇస్తున్న ఈ రోజుల్లో.. 15 రోజులు పని చేయించుకుని రూ.200 చేతిలో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
