నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి దగ్గర 44వ నేషనల్ హైవే పై వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి.
హైవేపై వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో.. ఆ ట్రక్కు రోడ్డుపైనే అకస్మాత్తుగా ఆగిపోయింది. దాంతో వెనుక వస్తున్న వాహనదారులు అప్రమత్తం అయ్యేలోపే.. ఒకదానికొకటి వరుసగా ఏడు కార్లు అత్యంత వేగంగా ఢీకొట్టుకున్నాయి. అదే సమయంలో ఆ కార్ల వెనుక నుంచి వచ్చిన ఒక కొబ్బరి బొండాల లారీ కార్లను పక్క నుంచి బలంగా ఢీకొంటూ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘోర ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రత భారీగా ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అటు బాధితులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
