- 90 రోజుల కూలీ పైసలు ఇచ్చేలా సర్కారు ఉత్తర్వులు
- రూ.5 లక్షల నిర్మాణ సాయానికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.27,000 లబ్ధి
- వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు కమిషనర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఊరట లభించింది. నిరుపేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా.. ఈ పథకాన్ని ఉపాధి హామీ స్కీమ్‌లో అనుసంధానించిన విషయం తెలిసిందే. అయితే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడికి 90 రోజులపాటు ‘అన్‌స్కిల్డ్’ కూలీ కింద వేతనం చెల్లించాలని పీఆర్, ఆర్డీ కమిషనర్ డి. దివ్య ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నందుకు గాను ఉపాధి హామీ కింద వేతనం పొందుతారు. రోజువారీ సగటు వేతనం రూ.300 చొప్పున లెక్కిస్తే.. 90 రోజులకు గాను ఒక్కో కుటుంబానికి సుమారు రూ.27,000 వరకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల నిర్మాణ సాయానికి ఇది అదనం కావడం విశేషం. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు కూలీ డబ్బులు రావాలంటే రాష్ట్ర స్థాయి నుంచి జాబితాలు రావాల్సి ఉండేది. దానివల్ల లబ్ధిదారులు నెలల తరబడి నిరీక్షించేవారు.
కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి లిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కమిషన లిపారు.. కలెక్టర్లు, ఎంపీడీవోలే నేరుగా లబ్ధిదారులను గుర్తించి, వారికి వెంటనే 90 రోజుల పని సాంక్షన్ చేసే అధికారం ఇచ్చారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
గతంలో పరిమితులు.. ఇప్పుడు పూర్తి ప్రయోజనం
గతంలో అమలు చేసిన గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల ప్రమేయం తక్కువగా ఉండటంతో ఉపాధి హామీ నిధుల వినియోగంపై అనేక పరిమితులు ఉండేవి. గతంలో గృహ నిర్మాణ పనులకు సంబంధించి కేవలం పునాది స్థాయి పనులకే పరిమితంగా సుమారు 45 నుంచి 60 రోజులు మాత్రమే కూలీ ఇచ్చేవారు.
అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకుంటున్న నేపథ్యంలో, ఎక్కడా కోత విధించకుండా పూర్తి స్థాయిలో 90 రోజుల పనిదినాలను కల్పించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. దీనివల్ల గతంలో కంటే లబ్ధిదారులకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కాగా, కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో దీని అమలును వేగవంతం చేశారు.
