నిర్మల్ జిల్లాలో వరి కొయ్యల మంటల బీభత్సం..300 ఎకరాలకు వ్యాపించిన మంటలు

నిర్మల్ జిల్లాలో  వరి కొయ్యల మంటల బీభత్సం..300 ఎకరాలకు వ్యాపించిన మంటలు

నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోన్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు వందలాది ఎకరాలను బూడిద చేశాయి. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనికి రైతన్నలు నిలువునా నష్టపోయారు.

స్థానికుల వివరాల ప్రకారం.. సోన్ గ్రామ సమీపంలోని ఓ పంట చేన్లో వరి కోతల అనంతరం మిగిలిన వరి కొయ్యలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే, అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న పొలాలకు వేగంగా వ్యాపించాయి. గాలుల తీవ్రతకు మంటలు అదుపుతప్పి ఏకంగా 300 ఎకరాల మేర విస్తరించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

ఈ ఘోర అగ్నిప్రమాదంలో పంట చేన్లలో ఉన్న అనేక బోరు బావుల మోటర్లు, పైపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కంటి ముందే కష్టార్జితం, లక్షలాది రూపాయల విలువైన వ్యవసాయ సామాగ్రి అగ్నికి ఆహుతైపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారీగా నష్టం వాటిల్లడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.