గ్రీన్లాండ్ విలీనానికి.. అమెరికా సభలో బిల్లు

గ్రీన్లాండ్ విలీనానికి.. అమెరికా సభలో బిల్లు

వాషింగ్టన్: గ్రీన్​లాండ్​ను విలీనం చేసుకోవాలని ప్రతిపాదిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యుడు ర్యాండీ ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు. ‘గ్రీన్​లాండ్​ విలీనం, రాష్ట్ర హోదా చట్టం’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. విలీనం చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్​కు నివేదిక సమర్పించాలని, ఆ తర్వాత గ్రీన్​లాండ్​ను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తూ ఫెడరల్ చట్టాలకు సవరణలు చేస్తామని బిల్లులో పేర్కొన్నారు.

 ‘‘అర్కిటిక్​లో ఉన్న గ్రీన్ లాండ్ ఏరియా షిప్పింగ్, ట్రేడ్, మిలిటరీ కదలికలను నియంత్రించే కీలక స్థానంగా ఉంది. అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన గ్రీన్​లాండ్​లో అమెరికా శత్రు దేశాల పాలన రాకూడదు. అందుకే డెన్మార్క్​తో చర్చించిగానీ లేదంటే గ్రీన్​లాండ్​ వాసులకు డబ్బులు పంచి కొనుగోలు చేసేందుకు గానీ చర్యలు తీసుకోవాలి” అని ప్రతిపాదించారు.