జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో జైష్ టెర్రరిస్ట్ హతం

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో జైష్ టెర్రరిస్ట్ హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని కథువా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) హతమయ్యాడు. నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల దాడిలో మన సైనికుడు ఒకరు వీర మరణం పొందారు. 

తాజాగా దీనికి ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం (జనవరి 23) బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదలు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు జమ్మూ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్ సేన్ టుటి తెలిపారు. 

ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారని.. వెంటనే అప్రమత్తమైన జవాన్లు కౌంటర్ ఫైరింగ్ జరిపారని చెప్పారు. భద్రత దళాల కాల్పుల్లో ఉగ్రవాది మరణించినట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని జైషే మహ్మద్ కమాండర్ ఉస్మాన్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అతని వద్ద నుంచి M4 ఆటోమేటిక్ రైఫిల్‌తో భారీగా ఆయుధాలు, మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉగ్రవాద కదలికలు పెరగడంతో భద్రతను భారీగా పెంచారు.