
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో సుల్తాన్ పూర్ జేఎన్టీయూ క్యాంపస్ కు ఫార్మసీ డిపార్ట్ మెంట్ ను తరలించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బీఫార్మసీ కోర్సు నడుస్తుండగా, కొత్త విద్యాసంవత్సరం నుంచి ఎంఫార్మసీ కోర్సును అక్కడే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో పూర్తిగా ఫార్మసీ డిపార్ట్ మెంట్ ను అక్కడే కంటిన్యూ చేయనున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ క్యాంపస్ కు 164 ఎకరాల స్థలంతో పాటు మంచి భవనాలూ ఉన్నాయి. దీంతో 2021–22 అకాడమిక్ ఇయర్ లో బీఫార్మసీ కాలేజీని ప్రారంభించారు. తాజాగా ఎంఫార్మసీతో పాటు పీహెచ్డీ, ఇతర అనుబంధ కోర్సులను అక్కడే కంటిన్యూ చేయనున్నారు.
2025–26 విద్యాసంవత్సరంలో అన్ని ఫార్మసీ కోర్సులకు సుల్తాన్ పూర్ లోనే అడ్మిషన్లు తీసుకోనున్నారు. అయితే, ప్రస్తుతం ఆ ఏరియాలోనే ఫార్మసీ సంస్థలు ఎక్కువగా ఉండటంతో అది ఫార్మసీ హబ్ గా మారుతోంది. దీంతో విద్యార్థుల పరిశోధనల కోసం అవి ఉపయోగపడుతున్నాయి. దీనికితోడు కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ వర్సిటీ క్యాంపస్ కు ల్యాండ్ లేదు. దీంతో కొన్ని డిపార్ట్ మెంట్లను ఇతర ప్రాంతాల్లో కొనసాగించాలని గతంలోనే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సుల్తాన్ పూర్కు ఫార్మసీ డిపార్ట్ మెంట్ ను తరలిస్తున్నారు.