
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిలేని పార్టీలు చాలా ఉన్నాయని, ఎవరు ధర్నా చేసినా అక్కడికి వెళ్లి ఈ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా ఎన్నో అంశాల్లో రాష్ట్రం అవార్డులు సాధిస్తోందని తెలిపారు. వయసుపైబడిన పంచాయతీ కార్మికుల పిల్లలకు జాబ్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని ఆయన వెల్లడించారు. గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల కృతజ్ఞత సభ జరిగింది. ఈ సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ. 2,70,000 కోట్లు చెల్లిస్తే కేంద్రం ఇచ్చింది రూ. 32 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. ‘కేంద్రం ఎంతో ఇస్తున్నదని, పెన్షన్ల పైసలు ఇస్తున్నదని కొందరు అంటున్నరు.
ప్రతి నెల ఆసరా పెన్షన్లకు రూ. 9,802 కోట్లు చెల్లిస్తుంటే అందులో కేంద్రం ఇస్తున్నది కేవలం రూ. 200 కోట్లే’ అని చెప్పారు. పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అని, ప్రతి నెల రూ. 339 కోట్ల నిధులిస్తూ గ్రామాల అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నారని మంత్రి తెలిపారు. పంచాయతీ కార్మికులకు ఎన్నో ఏండ్ల నుంచి రూ. 500 నుంచి రూ. 2,000 లోపు జీతాలు వస్తుంటే వాటిని రూ. 8,500కు చేశారని అన్నారు. కారోబార్ హోదాకు ఇబ్బంది కలుగనివ్వమని హామీ ఇచ్చారు. కార్మికులకు బీమా కల్పించే విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ప్రతి ఊరిలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే నెలలో మళ్లీ పల్లె ప్రగతి అమలవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల వేతనాలపై చర్చ వచ్చినప్పుడు అధికారులు రూ. 6వేలు చేయాలని ప్రతిపాదించారని, తాము రూ. 8వేలు చేయాలని సీఎం కోరామని, అయితే సీఎం రూ. 8,500 చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్ , రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.