తండ్రి ఆర్మీలో.. తల్లి మృతి: ద‌య‌నీయంగా పిల్ల‌ల ప‌రిస్థితి

తండ్రి ఆర్మీలో.. తల్లి మృతి: ద‌య‌నీయంగా పిల్ల‌ల ప‌రిస్థితి

మెదక్​  జిల్లా: ఆర్మీ జవాన్​ అయిన తండ్రి ఉద్యోగ రిత్యా దేశ బార్డర్​లో డ్యూటీలో ఉండగా, తల్లి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంఘటన మెదక్​ జిల్లా, నార్సింగి మండలం, సంకాపూర్​లో మంగళవారం జరిగింది.సంకాపూర్ గ్రామానికి చెందిన రాయిలాపురం నాగరాజు కొన్నేళ్లుగా భారత ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య లత.. వారి ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో ఇంటి వద్దే ఉంటోంది. ఐదు  నెలల కిందట రెండో బాబుకు జన్మనిచ్చింది లత. అయితే సోమవారం రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ల‌త‌.. ఆయాసంతో అవస్థపడింది. ఈ విషయం తెలుసుకున్న‌ గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ వెంటనే స్పందించారు.

లతను స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్ కు తరలించారు. అక్క‌డ‌ పరీక్షించిన డాక్టర్​ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ల‌త‌ను హైద‌రాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్య‌లోనే గుండెపోటుతో లత చనిపోయిందని తెలిపారు డాక్ట‌ర్లు. పంజాబ్ బోర్డర్ లో డ్యూటీలో ఉన్న నాగరాజుకు విషయాన్ని తెలియజేయగా.. ఆయన హుటాహుటిన స్వగ్రామానికి బయలు దేరినట్టు సర్పంచ్​ సుజాత శ్రీనివాస్ తెలిపారు. తండ్రి ఆర్మీలో ఉండగా, తమ ఆలనా, పాలనా చూస్తున్న తల్లి ఆకస్మాత్తుగా చనిపోవడంతో.. ఆరేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ ముగ్గురిలో ఐదు నెలల బాబు ఉండటం అందరిని కలచివేసింది.