హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏఐలో వచ్చిన ఒక ఫీచర్ఇప్పుడు కొన్ని రంగాల ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారు చేయాల్సిన పనిని అది సెకన్లలోనే చేస్తుండడంతో చాలామంది జాబ్స్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇంతలా వణికిస్తున్న ఆ ఏఐ ఫీచర్పేరు.. ‘ఆర్డర్ఎంట్రీ సూపర్ఏజెంట్’. ఈ మధ్య ‘ఏమిగా’ అనే ఏఐ ఆధారిత అటానమస్ ప్లాట్ ఫామ్ ‘జియా ఆర్డర్ ఎంట్రీ సూపర్ ఏజెంట్’ పేరున ఒక ఏఐ టూల్ విడుదల చేసింది.
ఇది కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్లను చదివి, అర్థం చేసుకుని క్షణాల్లో సిస్టమ్‌లో నమోదు చేయడంలో ఎక్స్పర్ట్అని రూపకర్తలు చెప్తున్నారు. ఇది భవిష్యత్‌లో ఉద్యోగులకు ముప్పుగా పరిణమిస్తుందని పలువురు ఎక్స్పర్ట్స్అంటున్నారు. 90 శాతం పనులు మ్యానువల్ గా కాకుండా ఏఐ టూల్ చేస్తుందని, దీంతో కంపెనీలు మనుషులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందంటున్నారు. ఎంతో మంది ఉద్యోగులు చేసే పనిని సెకన్లలో 100 శాతం కచ్చితత్వంతో చేస్తుందంటున్నారు.
గంటలు పట్టే పని.. నిమిషాల్లోనే..
ఈ ఏఐ టూల్స్‌ను ఇప్పటికే ఈ-– కామర్స్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వాడుతున్నారు. ఈ టూల్స్ఈ–మెయిల్స్, పీడీఎఫ్‌లను, పోర్టల్ ఆర్డర్లలో ఏ ఫార్మాట్లలో వచ్చే డేటాను అయినా స్పష్టంగా చదవగలవు. వస్తువు పేరు, క్వాంటిటీ, ధర వివరాలను గుర్తించి ఎంటర్ చేస్తాయి. డేటాలో తప్పులుంటే కనిపెట్టి అలర్ట్ చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ కేవలం కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది.
రోజుకు వేల ఆర్డర్లు తీసుకునే సంస్థలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, స్విగ్గి, ఇన్‌స్టామార్ట్, బ్లింక్ఇట్ తదతర సంస్థలకు ఇవి ఇలాంటి ఏఐ టూల్స్అత్యంత ఉపయోగకరంగా మారడంతో మొగ్గు చూపుతున్నాయి. ఏఐ సూపర్ ఏజెంట్ల వల్ల తప్పులు లేకపోవడం, పని వేగం పెరుగుతుండడంతో ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. కస్టమర్ సర్వీస్ మెరుగుపడుతోంది. గంటలు పట్టే పని నిమిషాల్లో పూర్తవుతోంది.
ఏ ఉద్యోగాలు తగ్గుతాయంటే..
ఈ ఏఐ టూల్వల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బ్యాక్ ఆఫీస్ స్టాఫ్, ఆర్డర్ ప్రాసెసింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐ ఒకేసారి వేగంగా, తప్పులు లేకుండా పనులు చేయడం వల్ల కంపెనీలకు ఖర్చు ఆదా అవుతుంది. దీంతో అవి మానవ ఉద్యోగాల బదులు ఆటోమేషన్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. పైగా, ఉద్యోగి మహా అయితే 12 గంటలు పని చేయగలడు..కానీ, ఏఐ టూల్స్ 24 గంటలు పని చేయగలవు.
వాటికి విశ్రాంతి అవసరం లేదు. తప్పులు కూడా ఉండవు. దీంతో కంపెనీలు మానవ శక్తిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. 90 శాతం ఉద్యోగాలు పోయినా, ఏఐ టూల్స్ కు అనుగుణంగా ఏఐ డేటా మేనేజ్మెంట్, డేటా విశ్లేషణ, టెక్నాలజీ సపోర్టు వంటి కొత్త రకమైన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఈఆర్పీ ఆటోమేషిన్ టూల్స్ ..
ఎంటర్ పైస్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) ఆటోమేషిన్ టూల్స్ కూడా డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బిల్లింగ్ వంటి పనులు చేస్తుండడంతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నది. కంపెనీలు డేటా మేనేజ్మెంట్, ఇన్వాయిసింగ్, ఇన్వెంటరీ, ఫైనాన్స్ రంగాల్లో వీటి సేవలను ఉపయోగించుకుంటున్నాయి. స్టాక్ చెక్చేయడం, ఆర్డర్ ఫ్లో ఎలా ఉందో తెలుసుకోవడం, సప్లై చైన్ ట్రాకింగ్ ఎలా జరగుతుందో కనుక్కోవడాన్ని ఇవి స్పీడ్‌గా చేస్తున్నాయి.
దీంతో మాన్యువల్ రిపోర్ట్, డేటా ఎంట్రీ అవసరం తగ్గి అకౌంటింగ్, ఫైనాన్స్ కాంట్రాక్ట్స్, రిపోర్ట్ ఎంట్రీ, హెచ్‌ఆర్ డేటా ఎంట్రీ ఉద్యోగాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాప్, ఓరాకిల్, నెట్ సూట్, సేల్స్ ఫోర్స్ ఆర్డర్స్ మేనేజ్ మెంట్ కంపెనీలు ఈ టూల్స్వాడుతున్నాయి. ఆర్డర్ నుంచి మొదలుపెడితే ట్రాన్సాక్షన్కంప్లీట్అయ్యేవరకు మొత్తం ఆటోమెటిక్ గానే నడుస్తోంది.
ఓసీఆర్ సిస్టమ్
ఓసీఆర్ సిస్టమ్స్ పేపర్ డాక్యుమెంట్స్, స్కాన్ ఫైల్స్ నుంచి టెక్స్ట్ గుర్తిస్తాయి. ఇది ఇమేజ్, పీడీఎఫ్, హ్యాండ్‌రైట్ డేటాను డిజిటల్ డేటాగా మారుస్తాయ. బ్యాంకులు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఆఫీసులు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నాయి. ఇన్ వాయిస్ లు, ఫార్మ్స్, రెసిప్ట్స్ త్వరగా ప్రాసెస్ అవుతాయి. మాన్యువల్ టైప్ చేసే ఉద్యోగాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
మార్పుకు అనుగుణంగా మారాల్సిందే..
ఏఐ సూపర్ ఏజెంట్లు వ్యాపార విధానాలను పూర్తిగా మార్చేయనున్న క్రమంలో మార్పుకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఉద్యోగులకు తప్పనిసరి అయ్యింది. అయితే ఇక్కడ ఏఐ అండ్ ఆటోమెషన్ టూల్స్ ద్వారా పాత రిపిటీటివ్ జాబ్స్ తగ్గి.. కొత్త స్కిల్స్ మానిటరింగ్, డేటా అనాలసిస్, టెక్నికల్ సపోర్టు వంటి ఉద్యోగాలు పెరిగే చాన్స్ ఉంది.
