
- హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- త్వరలో 1300కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన వైద్యవిద్యను బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, భారీ ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వైద్య విధాన పరిషత్ పరిధిలో 42 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలో 6 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 4 స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు జులై 12 నుంచి 26 వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్ లో అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఎంహెచ్ఎస్ఆర్బీ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
కాగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇటీవలే ఆ సంఖ్యను 1300కు పెంచినట్లు సమాచారం.
ఏడాదిన్నరలో 8 వేల ఉద్యోగాలు ఫిలప్
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 18 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) 2322 పోస్టులు ఉన్నాయి.