- అనుమతుల సాధనలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్
- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కృషితో ఫారెస్ట్ క్లియరెన్స్
- బ్రిడ్జి, పెండింగ్ రోడ్డు పనులకు రూ.120 కోట్లు మంజూరు
- అయినా పనుల్లో జాప్యం... నిరసనగా కాంగ్రెస్ ధర్నా
మంచిర్యాల/జైపూర్, వెలుగు: నేషనల్ హైవే 63లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్రోడ్డు పనులు పూర్తిచేయడంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణం ప్రారంభించి పదేండ్లు కావస్తున్నా జోడు వాగుల బ్రిడ్జికి మాత్రం మోక్షం కలగలేదు. ఇందుకు అవసరమైన ఫండ్స్, పర్మిషన్లు తీసుకురావడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైంది. ఎట్టకేలకు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫారెస్ట్ క్లియరెన్స్ సాధించారు. జోడు వాగులపై హైలెవల్బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ రోడ్డు పనుల కోసం రూ.120 కోట్లు సాంక్షన్ చేయించారు. ఇప్పటికే రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
పదేండ్లుగా వెంటాడుతున్న కష్టాలు....
ఎన్‌హెచ్63లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో రసూల్‌పల్లి నుంచి మహారాష్ట్ర బార్డర్‌లోని అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణానికి రూ.164 కోట్లు సాంక్షన్ చేసింది. ఈ పనులు ఆగుతూ.. సాగుతూ.. దాదాపు ఐదేండ్లు కొనసాగాయి. అయితే భీమారం, చెన్నూర్నడుమ ఉన్న రిజర్వ్ ఫారెస్టులో పనులకు క్లియరెన్స్ రాకపోవడంతో జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు పనులు నిలిచిపోయాయి. అనుమతుల సాధనలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫారెస్ట్ పర్మిషన్లకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో కేంద్రం సైతం చేతులెత్తేసింది. హైవే పనులు అసంపూర్తిగా మిగలడం వల్ల గత పదేండ్లగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే ఈ హైవేపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది.
మంత్రి, ఎంపీ కృషితో కదలిక
చెన్నూర్ ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచిన తర్వాత జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ హైవే పనులపై దృష్టి పెట్టారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి అసంపూర్తి పనుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పట్టుబట్టి ఫారెస్ట్ పర్మిషన్లతో పాటు ఫండ్స్ సాధించారు. వారి కృషి ఫలితంగా 2024 సెప్టెంబర్‌లో జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, పెండింగ్ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు సాంక్షన్ చేసింది. ఆ తర్వాత మరో రూ.20 కోట్లు కేటాయించింది. నిధులు మంజూరై రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్రీమెన్ కమిటీ నియామకం ఎప్పుడు?
ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.76.51 కోట్ల అంచనాలతో టెండర్కాల్చేశారు. ఈ ప్రక్రియ ఫైనల్స్టేజ్లో ఉన్నట్టు సమాచారం. ఇక చివరగా కేంద్ర, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో కూడిన త్రీమెన్‌కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులకు గ్రీన్సిగ్నల్ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ కమిటీ నియామకంలో జాప్యం వల్ల పనులు పడకేశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి రెండేండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదటి దశలో అటవీ భూమికి హద్దులు గుర్తించి ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తారు. రెండో దశలో టెండర్ ఖరారైన వెంటనే కాంట్రాక్ట్ సంస్థ రంగంలోకి దిగి వన్యప్రాణుల రక్షణకు ఇబ్బంది కలగకుండా చెట్ల తొలగింపు, సైట్ క్లియరెన్స్ పనులను రెండు నుంచి మూడు నెలల్లో ప్రారంభిస్తుంది. మూడో దశలో హై-లెవల్ బ్రిడ్జి, దానికి రెండువైపులా ఫోర్- లేన్ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 18 నెలల కాలపరిమితి విధిస్తారు. ఈ అటవీ ప్రాంతం టైగర్ కారిడార్ పరిధిలోకి రావడంతో నాలుగో దశలో వన్యప్రాణుల రాకపోకల కోసం అండర్ పాస్‌ల నిర్మాణం చేపడుతారు.
కాంగ్రెస్ ధర్నా
జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునాథ్ రెడ్డి, భీమారం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొడేటి రవి ఆధ్వర్యంలో ఆదివారం జోడు వాగుల వద్ద రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. హైవే 63 నిర్మాణంపై అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి పెంచి ఫారెస్ట్ పర్మిషన్లతో పాటు రూ.120 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చారని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో భీమారం, జైపూర్, చెన్నూర్ మండలాల లీడర్లు పాల్గొన్నారు.
