
హైదరాబాద్, వెలుగు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ఆలయ ఈవో పురేందర్ కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ.. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో సురేఖకు అమ్మవారి శేషవస్త్రాలు, చీర సమర్పించి తీర్థప్రసాదాలను అందించి వేదాశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆమె ఆదేశించారు. కాగా, మంత్రి సురేఖ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.