డబుల్ బెడ్రూం షాపుల వేలం నిలిపివేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

డబుల్ బెడ్రూం షాపుల వేలం నిలిపివేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
  •      సీఎంకు జాన్ వెస్లీ లేఖ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోని డబుల్ బెడ్రూం కాలనీల్లోని వాణిజ్య షాపులను వేలం వేయాలన్న సర్కార్ నిర్ణయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆయన బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పేదల, నివాసితుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని  హితవు పలికారు. 

మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డబుల్ బెడ్రూం కాలనీల్లో సుమారు 992 వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించాలని కలెక్టర్లు ప్రకటనలు విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. షాపులను అమ్మేసి, ఆ డబ్బును డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో కాలనీల మెయింటెనెన్స్ చేస్తామన్న ప్రభుత్వ ఆలోచన అసలు ప్రాక్టికల్‌గా లేదని లేఖలో పేర్కొన్నారు.