HHVM రిలీజ్ టైంలో.. ‘జానీ’ సినిమా ఫ్లాప్ అవడంపై.. పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

HHVM రిలీజ్ టైంలో.. ‘జానీ’ సినిమా ఫ్లాప్ అవడంపై.. పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

‘నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అతిథులుగా హాజరై సినిమా పెద్ద విజయం సాధించాలని టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ ఇంకా బ్రతికే ఉంది.  నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. అయినా  నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే.  పడినా, లేచినా, ఎలా ఉన్నా.. ‘అన్నా నీ వెంట మేమున్నాం’ అన్నారు. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. ‘జానీ’తో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని.  చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. వీరమల్లు సినిమా అందర్నీ ఇన్‌‌స్పైర్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. 

‘హరి హర వీరమల్లు’ కథ 1684లో స్టార్ట్ అవుతుందని, మొఘల్స్ నుంచి జ్యోతిర్లింగాలు కాపాడాలనే ఛత్రపతి శివాజీ చివరి కోరికను ఇందులో చూపించబోతున్నాం అని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పాడు.  ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్, నటులు  బ్రహ్మానందం, రఘుబాబు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డీవోపీ మనోజ్ పరమహంస  సహా టీమ్ అంతా పాల్గొన్నారు.