పరిషత్ ల గెలిస్తే పండుగే

పరిషత్ ల గెలిస్తే  పండుగే
  • కొత్త ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 40 రోజులు మస్తు మజా
  • జులై, ఆగస్టు లో జడ్పీ చైర్మన్ ,ఎంపీపీల ఎన్నిక
  • అప్పటిదాకా కొత్తోళ్లకు రాచ మర్యాదలు, క్యాంపులు
  • ఖర్చులు పెట్టుకునేందుకు రెడీ అవుతున్న జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ ఆశావహులు
  • ఇప్పటికే కోట్లు కుమ్మరించిన కొందరు  క్యాండిడేట్లు

లోకల్‌ బాడీ ఎన్నికల్ల గెల్చినోళ్లు నెల రెండ్నెల్లదాక మస్తు ఎంజాయ్‌ జేయొచ్చు. రిజల్ట్‌ రాంగనె వాళ్లను తీస్కబోయి
అన్ని సౌలతులతోని రిసార్టులల్ల క్యాంపులు పెట్టనీకి జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ పోస్టుల మీద ఆశవెట్టుకున్నోళ్లు రడీగున్నరు. కొత్తగ గెల్చెటోళ్లకే గాదు, పాతోళ్లకూ పండుగ లెక్కనే ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్ల ఎట్లయిన గెల్వాలని టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పుడున్న జడ్పీటీసీ, ఎంపీటీసీలతోని పక్క రాష్ట్రా ల్ల క్యాం పులు పెట్టే ప్లాన్‌ జేస్తున్నయ్‌. ఎవరి ఎంజాయ్‌మెంట్‌ ఎట్లున్నా క్యాంపులు పెట్టెటోళ్లకు ఖర్చులు మస్తు గనే అయితయ్‌.

పరిషత్‌ ఎన్నికల్లో గెలవబోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు జాలీ డేస్ రాబోతున్నాయి. ఈ నెల 27న రిజల్ట్స్​ వచ్చే నాటి నుంచీ జులై మొదటి వారం వరకు.. అంటే దాదాపు నలభై రోజులపాటు వీరందరూ ‘ఓటరు’ పాత్రలో అతిథి సత్కారాలు అందుకోబోతున్నారు. విందులు, విహార యాత్రల్లో మునిగితేలనున్నారు. ఎంపీపీ, జడ్పీ చైర్మన్లను ఎన్నుకునేది వీళ్లే కావడంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఇప్పటిదాకా పరిషత్ ఎన్నికల తర్వాత వారం, పది రోజుల్లోనే ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌కు ఎన్నిక  జరిగే అనవాయితీ ఉండేది. కానీ ఈసారి రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాత ఎంపీటీసీ, జడ్పీటీసీల ఐదేళ్ల పదవీ కాలం ముగియకపోవటంతో.. జులై 5 తర్వాతే జడ్పీ చైర్మన్​, ఎంపీపీల ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సుదీర్ఘ విరామం కొందరికి వర ప్రసాదంగా మారనుండగా.. ఇంకొందరి జేబులు గుల్ల చేయటం ఖాయమైంది.

32 జడ్పీలు.. 538 ఎంపీపీలు

రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లకు, మంగపేట మినహా 538 మండలాల్లో ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మం తప్ప మిగతా ఎనిమిది ఉమ్మడి జడ్పీల పదవీ కాలం జులై 5న ముగియనుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలో 39 ఎంపీపీలు మినహా రాష్ట్రంలోని 499 ఎంపీపీల పదవీ కాలం జులై 4తో ముగుస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయటం తప్పనిసరి కావటంతో ఆశావాహులందరూ తల పట్టుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మరో నెల ఆలస్యంగా ఆగస్టులో ఎన్నిక జరుగనుండటం అక్కడి అభ్యర్థులకు మరింత దడ పుట్టిస్తోంది. కొత్త జిల్లాల్లో తొలి జడ్పీ సీటును కైవసం చేసుకోవాలని కొందరు ఆశావహులు ఉవ్విళ్లూరుతుండగా, పాత జిల్లాల్లో తమ పరపతిని చాటిచెప్పాలని సీనియర్లు ఆశ పడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలనే ఈ పదవులు వరిస్తాయి. ఆయా జిల్లాలో గెలిచిన జడ్పీటీసీల్లో మెజారిటీ సభ్యుల మద్దతు సాధించిన అభ్యర్థిని జడ్పీ పీఠం వరిస్తుంది. మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీల మద్దతున్న అభ్యర్థి ఎంపీపీ పదవిని చేపడతారు. ప్రత్యక్షంగా చేతులెత్తే పద్ధతిన ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు ఆలస్యమైన కొద్దీ తమ ఓటు విలువ మరింత పెరుగుతుందని, తమను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలన్నీ కలిసొస్తాయని కొత్తగా గెలవబోయే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనుకుంటున్నారు.

ఇప్పటికే కోట్లకు కోట్లు..

చాలా జిల్లాల్లో జడ్పీ పీఠంపై కన్నేసిన క్యాండిడేట్లు ఇప్పటికే కోట్లు కుమ్మరించారు. పరిషత్​ ఎన్నికల్లోనూ తాహతుకు మించి ఖర్చు చేశారు. ప్రధానంగా వరంగల్, నల్గొండ, కరీంనగర్​, రంగారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల పరిధిలో ఈ పోటీ తారస్థాయికి చేరింది. కొందరు అభ్యర్థులు ఎలాగైనా జడ్పీని గెలుచుకోవాలని తమ జిల్లాల పరిధిలోని జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పారు. క్యాండిడేట్లు ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు ఒకెత్తైతే.. జెడ్పీ, ఎంపీపీ  పదవి దక్కించుకునేందుకు వేసే ఎత్తులు, పెట్టే ఖర్చులు అంతకు మించి ఉంటాయి. అందుకే నలభై రోజుల పాటు తమకు మద్దతిచ్చే జడ్పీటీసీలను కాపాడుకోవడం చైర్మన్​ రేసులో ఉన్న క్యాండిడేట్లకు కత్తి మీద సాములా మారనుంది. తమ చేతి చమురు వదులుతుందని, ఓటర్లకు అతిథి మర్యాదలు చేయాల్సి వస్తుందని కొందరు తల పట్టుకుంటున్నారు. రిజల్ట్ వచ్చిన రోజునే తమ మద్దతుదారులను క్యాంపులకు తీసుకెళ్లక తప్పదని చెబుతున్నారు. ‘టూర్​కు పోదాం.. రెడీ ఉండండి’ అంటూ తమ పరిధిలో గెలిచే అవకాశం ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కొందరు అభ్యర్థులు ఇప్పటికే టచ్‌‌లో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఎందరు తమకు అనుకూలంగా ఉంటారు? ఎవరికి ఎవరితో చెప్పిస్తే తమకు మద్దతు పెరుగుతుందన్న వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

వరంగల్​, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. అక్కడ ఓటు హక్కు న్న పాత జడ్పీటీసీలు,ఎంపీటీసీలను కాపాడుకునేం దుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపుల బాట పట్టాయి . ఎమ్మెల్సీ ఎన్నికలో తమకు ఓటు హక్కు లేకుం డా పోయిందని, అంది వచ్చిన అవకాశం మిస్సయిందనుకుంటున్న అక్కడి ఎంపీటీసీ, జడ్పీటీసీ క్యాండి డేట్లం తా ఇప్పుడు సంబురపడుతున్నారు.