హైదరాబాద్, వెలుగు:క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని గురువారం క్యూ న్యూస్ టీమ్ ప్రకటించింది. ప్రధాని మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టులతో రిమాండ్‌లో ఉన్నారు. మల్లన్నను విడుదల చేయించాలని పీఎం మోడీ, హోం మంత్రి అమిత్‌షాకు మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన భర్త నిరంతరం పోరాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన సెక్షన్ల కింద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారని వివరించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో ప్లేస్‌లో నిలిచారన్నారు. తన భర్త తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలనుకుంటు న్నారని తెలిపారు.
