హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 4న బీజేపీ మేనిఫెస్టో విడుదల

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు:  4న బీజేపీ మేనిఫెస్టో విడుదల

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నవంబర్ 4న (శుక్రవారం) సిమ్లాలో  విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 5, 9 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపాయి. 68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీకి నవంబర్ 12న  ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.  హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది. 

హిమాచల్‌  అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 43 మంది, కాంగ్రెస్‌కు 22 మంది సభ్యులున్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261 కాగా.. అందులో పురుషులు  27,80,208, మహిళలు  27,27,016 మంది ఉన్నారు. 1,86,681 మంది ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హిమాచల్ లో 80 ఏండ్లకుపైగా వయసున్న ఓటర్లు 1,22,087 మంది, 100 ఏండ్లు దాటిన ఓటర్లు 1,184 మంది ఉండటం విశేషం.