V6 News

రిచ్ పర్సన్ లా నటిస్తూ ధనవంతుల కూతుళ్లకు వల

రిచ్ పర్సన్ లా నటిస్తూ ధనవంతుల కూతుళ్లకు వల
  •     బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు వసూలు
  •     రిమాండ్​కు తరలించిన పోలీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్​ మీడియా ద్వారా బాలికలను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌‌కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ అనే యువకుడు ఉన్నత కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకునేవాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసిస్తూ ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న బాలికలను సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకునేవాడు. 

వారిని నమ్మించేలా పబ్బుల్లో తిరుగుతున్నట్లు నకిలీ ఫొటోలు సృష్టించి దగ్గరవుతుండేవాడు. అనంతరం బాలికలతో స్నేహం పెంచుకుని వారి ఫోటోలు, వీడియోలను సేకరించేవాడు. ఆ తర్వాత వాటిని అడ్డుగా పెట్టుకుని బెదిరిస్తూ బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను టార్గెట్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు.