ప్లాన్తోనే మైనర్పై అఘాయిత్యం

ప్లాన్తోనే మైనర్పై అఘాయిత్యం
  • బెంజ్ల అసభ్య ప్రవర్తన.. ఇన్నోవాలో అత్యాచారం​
  • బేకరీ దాకా బెంజ్​లోనే ఎమ్మెల్యే కొడుకు
  • పెద్దమ్మ గుడి వద్ద బలవంతంగా ఇన్నోవాలోకి బాలిక తరలింపు
  • మిగతా నలుగురితో కలిసి అఘాయిత్యం 
  • పోలీస్​ కస్టడీలో మొదటి రోజు సాదుద్దీన్​ వెల్లడి?

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​లో బాలికపై అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్​ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాదుద్దీన్​ను మూడు రోజుల పోలీస్​ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అతడిని చంచల్​గూడ జైలు నుంచి జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. మొదటి రోజు కస్టడీలో భాగంగా సాయంత్రం 6 గంటల దాకా విచారించారు. వ్యక్తిగత విషయాలు సహా నిందితుడు చెప్పిన ప్రతి స్టేట్​మెంట్​ను రికార్డ్​ చేశారు. విచారణకు సంబంధించిన ప్రతి పేపర్​పైనా సంతకాలు తీసుకున్నారు.
  
బాలిక నుంచి ‘రహస్య’ స్టేట్​మెంట్​ 
బాధిత బాలిక ఇచ్చిన 164 స్టేట్​మెంట్​ (అత్యాచార బాధితురాలి నుంచి జడ్జి సమక్షంలో మాత్రమే రహస్యంగా తీసుకునే వాంగ్మూలం), అమ్నీషియా పబ్​, కాన్సూ బేకరీ, పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, సెల్​ టవర్​ లొకేషన్ల ఆధారంగా సాదుద్దీన్​ను పోలీసులు విచారించారు. పబ్​లో జరిగిన ఈవెంట్​కు ఎవరు టికెట్లు బుక్​ చేశారు? ఎంత మంది పబ్​కు వెళ్లారు? బాలికతో వచ్చిన మైనర్​ అబ్బాయితో నిందితులకు పరిచయం ఉందా? వంటి ప్రశ్నలను సంధించారు. 

అయితే, అత్యాచారంపై పబ్​లోనే ప్లాన్​ చేసినట్టు సాదుద్దీన్​ చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత బెంజ్​ కారులో బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇన్నోవాలో గ్యాంగ్​రేప్​నూ అక్కడే ప్లాన్​ చేసినట్టు చెప్పాడని తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్​ కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రోద్బలంతోనే దారుణానికి పాల్పడ్డామని అతడు చెప్పినట్టు సమాచారం. 
 

బేకరీ దాకా కారులోనే ఎమ్మెల్యే కొడుకు

పబ్​ నుంచి కాన్సూ బేకరీ దాకా తానే బెంజ్​ కారును నడిపినట్టు సాదుద్దీన్​ చెప్పాడని తెలుస్తోంది. బేకరీ వరకు ఎమ్మెల్యే కొడుకు సహా ఇంకో ఇద్దరు మైనర్లు బెంజ్​ కారులోనే ఉన్నారని స్టేట్​మెంట్​ ఇచ్చినట్టు చెప్తున్నారు. బాలిక పట్ల ముందుగా ఎమ్మెల్యే కొడుకు, ఆ తర్వాత ఇంకో మైనర్​ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పినట్టు సమాచారం. ఆ ఘటనను ఒక్కొక్కరూ తమ తమ ఫోన్లలో వీడియో తీసుకున్నారని వివరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలను తమ స్నేహితులకు పంపారని చెప్పాడంటున్నారు. ఎమ్మెల్యే కొడుకు వెళ్లిపోయాక తాను వెనక సీట్లోకి వెళ్లి బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పాడని తెలుస్తోంది. బేకరీ వద్ద బాలికను బలవంతంగా ఇన్నోవాలోకి ఎక్కించుకున్నామని, తనతో పాటు మిగతా నలుగురు మైనర్లూ ఆమెపై అత్యాచారం చేశామని విచారణలో సాదుద్దీన్​ చెప్పినట్టు సమాచారం.
 
మైనర్లూ పోలీస్​ కస్టడీకి 
సాదుద్దీన్​తో పాటు నిందితులుగా ఉన్న నలుగురు నిందితులనూ విచారించేందుకు పోలీసులు జువనైల్​ జస్టిస్ బోర్డును కోరినట్టు సమాచారం. తీవ్రమైన నేరం కావడంతో జువనైల్​ జస్టిస్​ చట్టం ప్రకారం.. నిందితులను మేజర్లుగానే పరిగణించాల్సిందిగా బోర్డుకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అప్పీల్​ను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్​, ఇద్దరు సభ్యులతో కూడిన జువనైల్​ జస్టిస్​ బోర్డు.. ముగ్గురు మైనర్లను ఐదు రోజుల పాటు పోలీస్​ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు విచారణకు అనుమతినిచ్చింది. అయితే, కొన్ని షరతులను విధించింది. అడ్వొకేట్​ సమక్షంలోనే వారిని విచారించాలని, జువనైల్​ హోంకు వెళ్లి మాత్రమే విచారణ జరపాలని, విచారణకు సివిల్​ డ్రెస్​లోనే వెళ్లాలని, పెన్ను, పేపర్​ తప్ప వేరే ఏవీ తీసుకెళ్లరాదని ఆదేశించింది. దీంతో సైదాబాద్​ జువనైల్​ హోంలో అబ్జర్వేషన్​లో ఉన్న ముగ్గురు మైనర్లను.. హాల్​లోని ప్రత్యేక గదిలో విడివిడిగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

పోలీసుల నిర్ణయానికి మద్దతు
నిందితులను జువైనల్​గా కాకుండా మేజర్​గానే పరిగణించాలన్న పోలీసుల విజ్ఞప్తికి నేను మద్దతిస్తున్నా. రేప్​ లాంటి తీవ్రమైన నేరాల్లో శిక్షలకు వయసు అడ్డురాకూడదు. మేజర్ల తరహాలోనే వారినీ విచారించేందుకు కోర్టుకు విజ్ఞప్తి చేసిన పోలీసులకు నా అభినందనలు. 

- ట్విట్టర్​లో కేటీఆర్