ఆధ్యాత్మికం: జూన్ 1 హనుమత్ జయంతి: తిరుమలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు

ఆధ్యాత్మికం:  జూన్ 1 హనుమత్ జయంతి:  తిరుమలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. తెలంగాణలో చైత్ర పౌర్ణమిరోజు , ఆంధ్రప్రదేశ్ లో వైశాఖ దశమి రోజు, తమిళనాడు - కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో జరుపుకుంటారు...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆలయాలలో ప్రతినెలా విశేష ఉత్సవాలు జరుగుతాయి అన్న విషయం తెలిసిందే. ఇక జూన్ మాసంలో తిరుమలలో జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థం లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

టీటీడీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు మొత్తం ఐదు రోజులపాటు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించడంతోపాటు, జపాలీ తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా అంజనాద్రి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు రోజులపాటు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించనున్నారు. 

 ఐదు రోజులు హనుమాన్ కు అభిషేకాలు ఇలా .......

మొదటి రోజు జూన్ 1వ తేదీన మల్లెపూలతో, జూన్ రెండవ తేదీన తమలపాకులతో, జూన్ మూడవ తేదీన ఎర్రగన్నేరు తో, కనకాంబరాల తో, జూన్ 4వ తేదీన చామంతి తో, చివరి రోజైన జూన్ 5వ తేదీ సింధూరంతో అంజనాద్రి శ్రీ బాలాంజనేయ స్వామి స్వామివారికి అభిషేకం చేస్తారు. అంతేకాదు పండితులచే శ్రీ ఆంజనేయ సహస్రనామార్చనల తో పాటు అత్యంత ఘనంగా మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 

జపాలీలో కార్యక్రమాలు ఇలా 

ఉదయం 10 గంటలకు ఆకాశగంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతం పై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక జపాలి లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన హరికథ, జూన్ రెండవ తేదీన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలు, జూన్ మూడవ తేదీన పురందరదాసు సంకీర్తనలు నిర్వహిస్తారు. 

ప్రతీరోజూ సాయంత్రం నృత్య కార్యక్రమాలు 

జూన్ 4వ తేదీన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన కార్యక్రమాలు, జూన్ 5వ తేదీన ప్రాజెక్టు కళాకారులచే హరికథాగానం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి.  అంతే కాదు హనుమాన్ జయంతి సందర్భంగా నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం తో పాటు హనుమంతుడికి సంబంధించిన ఇతర ఆసక్తికర విషయాలపై ప్రముఖ వేద పండితులతో హనుమాన్ జననంతో పాటు, అనేక అంశాలపై  ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారు