మెడికల్ పీజీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలి.. మంత్రి దామోదరకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వినతి

మెడికల్ పీజీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలి.. మంత్రి దామోదరకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పీజీ మెడికల్ (ఎంక్యూ1 కేటగిరీ) సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ జూడా) మంగళవారం (సెప్టెంబర్ 30) ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ స్థానిక విద్యార్థులకు న్యాయం జరగాలని టీ జూడా ప్రతినిధులు మంత్రికి వివరించారు. 

జీవో నంబర్ 40, 42 ప్రకారం 25 శాతం ఎంక్యూ-1 సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయించడం వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు మన రాష్ట్రంలో సులభంగా సీట్లు పొందే అవకాశం ఉందని టీ జూడా ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ సమస్య పరిష్కారానికి మంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు జూడాలు పేర్కొన్నారు. నీట్ పీజీ కౌన్సెలింగ్ అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం కానుండగా, మంత్రి ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, త్వరలోనే ప్రస్తుత జీవోలలో మార్పులు వస్తాయని టీ జూడాలు ఆశాభావం వ్యక్తం చేశారు.